సురక్షితంగా భారత్‌ చేరుకున్నా

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.

By -  అంజి
Published on : 3 March 2026 3:33 PM IST

PV Sindhu, Dubai Airport Explosion, All England Open 2026, Gulf Tensions, Iran-Israel Conflict, Shuttler Stranded Dubai, Badminton News Telugu

సురక్షితంగా భారత్‌ చేరుకున్నా 

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు చేరుకున్నట్లు ప్రకటించారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయం మూతపడటంతో ఆమె గత శనివారం (ఫిబ్రవరి 28) నుండి అక్కడే చిక్కుకుపోయారు.

ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్ వెళ్తుండగా సింధు దుబాయ్‌లో ట్రాన్సిట్ ఆగారు. అయితే గల్ఫ్ గగనతలం మూసివేయడంతో ఆమె ప్రయాణం నిలిచిపోయింది. "చివరికి ఇంటికి చేరుకున్నాను, క్షేమంగా ఉన్నాను. గత కొన్ని రోజులు చాలా అనిశ్చితిగా, తీవ్ర భయాందోళనల మధ్య గడిచాయి. కష్టకాలంలో మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులకు కృతజ్ఞతలు," అని సింధు తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

కళ్లముందే పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

మార్చి 1వ తేదీన తాను బస చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఒక శక్తివంతమైన పేలుడు సంభవించిందని సింధు వెల్లడించారు. ఆ సమయంలో తన కోచ్ ఇర్వాన్స్య ఆది ప్రతామ పొగ, శిధిలాలకు అతి సమీపంలో ఉన్నారని, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ఆమె తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని, ఆ తర్వాత భారత హైకమిషన్ అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని ఆమె వివరించారు. దుబాయ్‌లో చిక్కుకుపోవడం వల్ల సింధు తన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మ్యాచ్‌లకు హాజరు కాలేకపోయారు. మొదటి రౌండ్‌లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిడ కటెథాంగ్‌తో తలపడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె టోర్నీ నుంచి తప్పుకుని, విశ్రాంతి తీసుకుని తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోనున్నారు.

Next Story