PV Sindhu : పీవీ సింధు నిష్క్రమణ
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బుధవారం హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.
By - Medi Samrat |
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బుధవారం హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. డెన్మార్క్‌కు చెందిన అన్‌సీడెడ్ లైన్ క్రిస్టోఫర్‌సన్‌తో జరిగిన మూడు గేమ్‌లలో సింధు ఓడిపోయింది. గత నెల BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సింధు.. హాంకాంగ్ ఓపెన్ చివరి-32 మ్యాచ్‌లో 21-15, 16-21, 19-21 తేడాతో డానిష్ షట్లర్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
25 ఏళ్ల క్రిస్టోఫర్సన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సింధుకు ఇదే తొలి ఓటమి. గంటలోపే మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఏడాది స్విస్, జపాన్ ఓపెన్‌లలో కూడా సింధు ముందుగానే నిష్క్రమించింది. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్-ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఫామ్‌లోకి తిరిగి వచ్చే సంకేతాలను చూపింది. కానీ హాంకాంగ్ ఓపెన్‌లో ఆమె రాణించలేకపోయింది.
తొలి గేమ్‌లో పివి సింధు 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే క్రిస్టోఫర్‌సన్ పునరాగమనం చేసి స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్‌తో ఆధిక్యాన్ని కొనసాగించి స్కోరును 14-13 చేసింది. ఇక్కడి నుంచి సింధు తన ఆటను మరింత మెరుగుపరుచుకుని ఆరు పాయింట్ల తేడాతో తొలి గేమ్‌ను గెలుచుకుంది.
పివి సింధు రెండో గేమ్‌లోనూ 13-12తో ఆధిక్యంలో ఉంది. సింధు వరుసగా ఆరోసారి డెన్మార్క్ క్రీడాకారిణిని ఓడిస్తుందని అనిపించింది. అయితే సింధు తప్పిదాలతో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. దీంతో ఐదు పాయింట్ల తేడాతో రెండో గేమ్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత ఇరువురి మధ్య మధ్య నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. 19-19తో ఇరువురు సమంగా ఉన్నారు. ఆ తర్వాత క్రిస్టోఫర్సన్ వరుసగా రెండు పాయింట్లు సాధించి సింధు పోరాటాన్ని ముగించింది.