ఇప్పుడిప్పుడే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లు మొదలయ్యాయి. భారత షట్లర్లు కూడా తమ సత్తా చాటాలని అనుకుంటూ ఉన్నారు. కానీ స్టార్ షట్లర్ అయిన పీవీ సింధు పది నెలల విరామం తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో పేలవమైన ప్రదర్శనను కనబర్చింది. ఫేవరెట్‌గా బరిలో దిగిన పీవీ సింధు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్‌లో మొదటి రౌండ్ లోనే వెనుదిరిగింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్ చేతిలో 21-16, 24-26, 13-21తో ఓటమిపాలైంది. 74 నిమిషాల పోరులో ప్రపంచ 18వ ర్యాంకర్ మియా సింధును ఓడించింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ముందు మ్యాచ్ ఫిట్‌నెస్ పరీక్షించుకోవాలని భావించిన సింధుకు మియా షాక్ ఇచ్చింది.
మరో వైపు ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఆమెను థాయిలాండ్ ఓపెన్ సూపర్-1000 నుండి తప్పించారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో సైనా నెహ్వాల్‌కు కరోనా సోకినట్టు తేలింది. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. వెంటనే వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు.