బెంగ‌ళూరుపై పంజా విసిరిన పంజాబ్‌.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

Punjab win by 54 runs keep season alive.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్ లో చెన్నై, ముంబైకి త‌ప్ప మిగిలిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2022 2:58 AM GMT
బెంగ‌ళూరుపై పంజా విసిరిన పంజాబ్‌.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్ లో చెన్నై, ముంబైకి త‌ప్ప మిగిలిన అన్ని జ‌ట్ల‌కు ప్లేఆఫ్స్‌ చేరుకునేందుకు అవ‌కాశం ఉండ‌డంతో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించి ప్లేఆఫ్స్‌ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. శుక్ర‌వారం బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచులో 54 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 12 మ్యాచుల్లో పంజాబ్‌కు ఇది ఆరో విజ‌యం కాగా.. 13 మ్యాచుల్లో బెంగ‌ళూరుకు ఇది ఆరో ఓట‌మి.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో (66; 29 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లు), లియాన్ లివింగ్‌స్టోన్‌ (70; 42 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంస‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (19), జితేశ్‌ శర్మ (9), హర్‌ప్రీత్‌ (7), రిషిధవన్‌ (7), రాహుల్‌ చాహర్‌ (2) స్వ‌ల్వ వ్య‌వ‌ధిలో వెనుదిరిగారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

భారీ ల‌క్ష్యాన్నిఛేదించేందుకు బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు.. 3 ఓవ‌ర్ల‌కు 31/0 స్థితి నుంచి 5 ఓవ‌ర్ల‌కు 41/3 తో ఇబ్బందుల్లో ప‌డింది. మాక్స్‌వెల్ (35; 22 బంతుల్లో 3పోర్లు, 1సిక్స్‌), ర‌జత్ పాటిదార్ (26; 21బంతుల్లో 1పోర్‌,2సిక్స‌ర్లు) పోరాడినా మిగితా బ్యాట‌ర్ల వైఫ‌ల్యం బెంగ‌ళూరు కొంప‌ముంచింది. దీంతో బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ మూడు, రిషి ధ‌వ‌న్, చాహ‌ర్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. బెయిర్ స్టో కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Next Story