ఆ ఇద్ద‌రూ మాకొద్దు బాబోయ్‌.. వ‌దిలించుకునేందుకు సిద్ద‌మైన పంజాబ్‌

Punjab likely to release Glenn Maxwell, Sheldon Cottrell. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020లో అదృష్టం క‌లిసి రాని

By Medi Samrat  Published on  11 Nov 2020 4:54 PM IST
ఆ ఇద్ద‌రూ మాకొద్దు బాబోయ్‌.. వ‌దిలించుకునేందుకు సిద్ద‌మైన పంజాబ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020లో అదృష్టం క‌లిసి రాని జ‌ట్టు ఏదైనా ఉంది అంటే అది ఖ‌చ్చితంగా కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ మాత్ర‌మే. టోర్నీ ఆరంభంలో గెలుపు అంచుల దాకా వ‌చ్చి చాలా మ్యాచుల్లో ఓట‌మి పాలైంది. చివ‌రికి టోర్నీని ఆరో స్థానంతో ముగించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, క్రిస్‌గేల్ మాత్ర‌మే రాణించ‌గా.. మ‌రికొంద‌రు దారుణంగా విఫ‌లం అయ్యారు. వ‌చ్చే సీజ‌న్‌కు మ‌రో ఆరునెల‌లు మాత్ర‌మే సమ‌యం ఉండ‌డంతో.. పంజాబ్ యాజ‌మాన్యం అప్పుడే 2021 సీజ‌న్ కోసం సిద్ద‌మ‌వుతోంది.

ఈ సీజ‌న్‌లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు పంజాబ్‌ సిద్ధమైంది. మ్యాక్స్ వెల్ ను రూ. 10.75 కోట్లు, కాట్రెల్ ను రూ. 8.5 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. మ్యాక్స్ వెల్ తాను ఆడిన 13 మ్యాచ్ లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజ‌న్‌లో ఒక్క సిక్స్ కూడా మాక్స్‌వెల్ కొట్ట‌లేక‌పోయాడు. ఇక కాట్రెల్‌ 6 మ్యాచ్‌ల్లో 8.80 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో మాక్స్‌వెల్, కాట్రెల్ ఆట‌తీరు ప‌ట్ల‌ పంజాబ్ తీవ్ర అసంతృప్తితో ఉంద‌ట‌. మరోవైపు 2021 ఐపీఎల్‌కు కూడా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌, ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించే అవకాశముంది. తొలిసారి పంజాబ్‌కు నాయకత్వం వహించిన రాహుల్‌ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. 55.83 సగటుతో 670 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్‌‌ క్యాప్‌ను రాహుల్ గెల్చుకున్నాడు. ఇక కోచ్ కుంబ్లే ప‌నితీరు ప‌ట్ల జ‌ట్టు యాజ‌మాన్యం సంతృప్తితో ఉంది. దీంతో 2021 ఐపీఎల్‌కు ప్రధాన కోచ్‌గా కుంబ్లేను కొనసాగించే అవకాశముంది.

మయాంక్‌ అగర్వాల్, నికోలస్‌ పూరన్, మొహమ్మద్ షమీ, క్రిస్ గేల్,‌ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌లను పంజాబ్‌ యాజమాన్యం కొనసాగించే వీలుంది. వచ్చే ఏడాది కొత్త జట్టు రానున్న నేపథ్యంలో భారీ వేలం జరుగనుంది. అందుకే మిడిల్‌ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది పంజాబ్.


Next Story