కరోనా కారణంగా గత ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (పి.ఎస్.ఎల్.) వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ 2020లో నిర్వహించారు. ఈ ఏడాది కూడా అత్యంత కట్టుదిట్టంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ ను నిర్వహించాలని అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కరోనా మహమ్మారి షాక్ ఇచ్చింది. ఆటగాళ్లకు కోచింగ్ సిబ్బందికి కరోనా సోకడంతో 2021 పాకిస్థాన్ సూపర్ లీగ్ ను వాయిదా వేశారు.
పీఎస్ఎల్ లో పాల్గొన్న 7 మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పీఎస్‌ఎల్ 2021ని వాయిదా వేస్తున్నట్లుగా పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఇంకొంత మంది ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించాయని.. వారి రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. ఫిబ్రవరి 20న ఆరంభమైన పీఎస్‌ఎల్ మార్చి 22 వరకు కొనసాగాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. మొత్తం 34 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా.. కేవలం 14 మ్యాచ్ లు మాత్రమే నిర్వహించారు. ఫవాద్ అహ్మద్, టామ్ బాంటమ్ లతో పాటూ కరాచీ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ కమ్రాన్ అక్మల్ కు కూడా కరోనా సోకిందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టోర్నీని వాయిదా వేయడమే మంచిదని నిర్వాహకులు, పీసీబీ భావించాయి. దీంతో ఈ ఏడాది కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడింది.