భారత్‌తో సిరీస్‌కు ముందే ద‌క్షిణాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ‌

Proteas pacer Anrich Nortje ruled out of Test series.భార‌త జ‌ట్టుతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ద‌క్షిణాఫ్రికాకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 4:41 AM GMT
భారత్‌తో సిరీస్‌కు ముందే ద‌క్షిణాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ‌

భార‌త జ‌ట్టుతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ద‌క్షిణాఫ్రికాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గింది. ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ అన్రిచ్ నార్జ్ గాయం కార‌ణంగా టెస్ట్ సిరీస్ మొత్తానికే దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) వెల్ల‌డించింది. ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి గాయాల‌తో నోర్జే స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. మ‌రోసారి మోకాలి గాయం తిర‌గ‌బెట్ట‌డంతో అత‌డు టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు దూరం అయ్యాడు.

'గ‌త కొంత‌కాలంగా అన్రిచ్ నార్జ్ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్ర‌స్తుతం అత‌డు వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్ నుంచి అత‌డిని ప‌క్క‌న పెట్టాం. అత‌డు దూరం అవ్వ‌డం నిజంగా పెద్ద లోటు. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకోలేదు. 20 మందితో జ‌ట్టును ఎంపిక చేయ‌డంతో ప్ర‌స్తుతానికి ఆ అవ‌స‌రం లేన‌ట్లు బావిస్తాం. కగిసో రబాడ, బీరన్‌ హెండ్రిక్స్‌, గ్లెంటన్‌ స్టుర్‌మాన్‌, డ్యుయాన్నే ఒలివర్‌, సిసండా మగాలాలతో కూడిన నాణ్య‌మైన పేస్ విభాగం ఉంది.' అని ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇటు టీమ్ఇండియాలోనూ ప‌లువురు కీల‌క ఆట‌గాళ్లు టెస్ట్ సిరీస్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, యువ ఆట‌గాళ్లు శుభ్‌మ‌న్ గిల్, అక్ష‌ర్ ప‌టేల్ లు గాయాల బారిన ప‌డ‌డంతో ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం వీరంతా బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీ(ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ కోసం శ్ర‌మిస్తున్నారు. ఇక ఇరుజ‌ట్ల మ‌ధ్య ఈనెల 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Next Story