టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి.. 8 మందిపై కేసు నమోదు
Prithvi Shaw attacked for denying selfies in Mumbai’s Oshiwara.టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2023 11:19 AM GMTటీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. పృథ్వీ షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్ సురేంద్ర పై ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ వెలుపల దుండగులు దాడికి పాల్పడ్డారు.దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు 8 మంది పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..?
బుధవారం(ఫిబ్రవరి 15న) పృథ్వీ షా తన స్నేహితుడు ఆశిష్ సురేంద్ర తో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడకు వచ్చిన గుర్తు తెలియని నిందితులు పృథ్వీతో సెల్పీలు దిగాలని అడిగారు. అయితే.. తాను స్నేహితుడితో కలిసి డిన్నర్ కు వచ్చానని వారికి చెప్పిన పృథ్వీ ఇద్దరితో సెల్ఫీలు దిగాడు. మిగతా వారు కూడా వచ్చి సెల్ఫీలు కావాలని గొడవ చేయడంతో పక్కనే ఉన్న సురేంద్ర హోటల్ మేనేజర్‌కు విషయాన్ని వివరించగా.. అతడు వచ్చి నిందితులను హోటల్ నుంచి వెళ్లాల్సిందిగా కోరారు.
దీనిని నిందితులు మనసులో పెట్టుకున్నారు. డిన్నర్ చేసి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్ బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. కారు ముందు, వెనుక అద్దాలను పగుల కొట్టారు. ఆ సమయంలో పృథ్వీ కారులోనే ఉన్నట్లు సురేంద్ర చెప్పాడు. వివాదం పెద్దది చేయకూడదు అనే ఉద్దేశ్యంతో పృథ్వీని మరో కారులో పంపించగా.. షా కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద అడ్డుకున్నారు.
ఓ మహిళ పృథ్వీ షా వద్దకు వచ్చి.. ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, లేకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరించిందని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్ సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్న అనంతరం నిందితుల్లో ఇద్దరిని గుర్తించారు. సనా అలియాస్ సప్నా గిల్, శోభిత్ ఠాకూర్ అదుపులోకి తీసుకున్నారు.