ఏంటి ప్రసిద్ధ్..బౌల్ట్ మీదికి బంతిని బుల్లెట్‌లా విసిరావు.. వీడియో వైర‌ల్‌

Prasidh Krishna hilariously throws the ball at bowler Trent Boult.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 2:45 PM IST
ఏంటి ప్రసిద్ధ్..బౌల్ట్ మీదికి బంతిని బుల్లెట్‌లా విసిరావు.. వీడియో వైర‌ల్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో సోమ‌వారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్‌క‌తా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (54; 49 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా.. హెట్‌మైర్‌ (27 నాటౌట్‌; 13 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో సౌథీ రెండు, ఉమేశ్‌, శివమ్‌, అనుకూల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేదించింది. నితీశ్‌ రాణా (48 నాటౌట్‌; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (42 నాటౌట్‌; 23 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (34) రాణించారు. రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ సేన తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్ ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. తొలి బంతిని కేకేఆర్‌ బ్యాటర్‌ బాబా ఇంద్రజిత్‌ మిడాన్‌ దిశగా ఆడాడు. ర‌న్ కోసం ప‌రిగెత్తాడు. అయితే.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్ర‌సిద్ధ్ కృష్ణ బంతిని అందుకుని వికెట్ కీప‌ర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. అయితే.. ప్రసిద్ధ్ కృష్ణ త్రో చేసిన బంతి నేరుగా ట్రెంట్ బౌల్ట్ బూట్‌కు తగిలింది. దీంతో దెబ్బకు బౌల్ట్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ బిత్తరపోగా.. జోస్ బట్లర్ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకున్నాడు. మరో ఫీల్డర్ షిమ్రోన్ హెట్మెయిర్ నవ్వాలో ఏడ్వాలో తెలీని స్థితిలో కనిపించాడు. కెప్టెన్‌, వికెట్ కీపర్ సంజు శాంసన్ మాత్రం అసహనాన్ని వ్యక్తం చేశాడు.కాగా.. దీనికి సంబంధిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


Next Story