పొలార్డ్, పురాన్ మెరుపులు.. రెండోసారి ఫైనల్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్

మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat
Published on : 12 July 2025 2:20 PM IST

పొలార్డ్, పురాన్ మెరుపులు.. రెండోసారి ఫైనల్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్

మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఎంఐ న్యూయార్క్ మూడు వికెట్లకు 172 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఫైనల్లో MI న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్ న్యూయార్క్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 29 పరుగుల వద్ద టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగుల వద్ద రెండో వికెట్‌ను, 43 పరుగుల వద్ద మూడో వికెట్‌ను.. 85 పరుగుల వద్ద సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. 42 బంతుల్లో 59 పరుగులు చేసి కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అవుటయ్యాడు. దీని తర్వాత, అకిల్ హుస్సేన్, డెవాన్ ఫెరీరా ఆరో వికెట్‌కు అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హుస్సేన్ 32 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. ఫెరీరా 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఎంఐ బౌల‌ర్ల‌లో ట్రిస్టన్ లూస్ మూడు వికెట్లు, రుషీల్ ఉగార్కర్ రెండు వికెట్లు తీశారు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఎంఐ న్యూయార్క్ జట్టు 43 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది. అయితే మోనాంక్ పటేల్, కెప్టెన్ నికోలస్ పూరన్ లు పరుగుల వేగాన్ని తగ్గించలేదు. మొనాంక్ 49 పరుగులు చేసి, పూరన్‌తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్ పూరన్‌కు మద్దతు ఇచ్చాడు. పూరన్, పొలార్డ్ లు నాలుగో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. పొలార్డ్ 22 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో కెప్టెన్ నికోలస్ పురాన్ 36 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. 19వ ఓవ‌ర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు పురన్. ఈ విజ‌యంతో ఎంఐ న్యూయార్క్ టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది.

Next Story