ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్ మార్చి 9 నుండి జరగనుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం రోజున వీరు గ్రౌండ్‌లోకి వచ్చి మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ఈ సిరీస్ లో 2-0 తో లీడ్ లో ఉంది. ఇక 2017లో భారత్ లో జరిగిన చివరి నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది.
గాయాల కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్ నుంచి నిష్క్రమించగా, వ్యక్తిగత కారణాల చేత కెప్టెన్ కమిన్స్ పాక్షికంగా లీవ్ తీసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ ను తాజాగా తప్పించారు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ, మార్ష్ కప్ ఫైనల్ ఆడేందుకు స్వదేశానికి బయల్దేరాడు అగర్. తొలి రెండు టెస్ట్‌ల్లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కని అగర్‌ను ఆసీస్ యాజమాన్యం రిలీజ్ చేసింది.