ఆటలలో గెలుపు, ఓటములు సహజం. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే అంతటితో జీవితం ఏమీ ముగిసిపోదు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపుబాట పట్టాలి. అంతేకాని ఓడిపోయామని చెప్పి ప్రాణాలు తీసుకోవడం దారుణం. ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయానన్న మనస్తాపంతో ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా, బబిత ఫొగట్‌ల సోదరి రితిక ఫొగట్ (కజిన్) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 17 సంవత్సరాలు.
మహావీర్ ఫొగట్ స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇటీవల భరత్‌పూర్ లో మార్చి 12 నుంచి 14 వరకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో రెజ్లింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్రస్థాయి జూనియర్ విమెన్, సబ్ జూనియర్ పోటీల్లో రితిక పాల్గొంది. ఈ పోటీల్లో ఆది నుంచి మంచి ప్రతిభ కనబరిచిన రితిక ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో కేవలం ఒకే ఒక పాయింట్‌తో ఓటమి చవిచూసింది. దీంతో నాటి నుంచి తీవ్ర కుంగుబాటుకు లోనైంది. బుధవారం రాత్రి మహవీర్ సింగ్ ఫోగట్ నివాసంలోనే తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. టోర్నీలో ఓటమితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రితిక ఫొగట్ మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది.
రాష్ట్రస్థాయి పోటీల్లో ఓటమి పెద్ద విషయం కాదని, రితిక ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తమకు అర్థం కావడం లేదని ఆమె సోదరుడు హర్వీంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓటమి తర్వాత తన తండ్రి మెన్‌పాల్, కోచ్ మహావీర్‌లు రితికకు ధైర్యం చెప్పారని అన్నాడు. కానీ, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామన్నాడు.