భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమక్షంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో సమావేశంపై వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శనివారం ఖండించింది. ఈ సమావేశానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి పిసిబి, బిసిసిఐ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించడానికి ఐసీసీ నవంబర్ 26 (మంగళవారం) ఇరు బోర్డులను సమావేశానికి పిలవవచ్చని శుక్రవారం మీడియా నివేదికలు పేర్కొన్నాయి. టోర్నమెంట్ షెడ్యూల్, హైబ్రిడ్ మోడల్ గురించి ఇందులో చర్చించనున్నారని నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలను పీసీబీ ఖండించింది.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది.. అయితే ఇప్పటి వరకు టోర్నమెంట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఇంకా ప్రకటించలేదు. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు ఇప్పటికే నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించింది.
ఇదిలా ఉండగా.. బీసీసీఐ, ఐసీసీతో సమావేశానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పీసీబీ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. మాకు, బీసీసీఐ, ఐసీసీల మధ్య సమావేశం జరగనున్నట్లు ఐసీసీ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది.