ఫైనల్‌కు ముందు పీసీబీ కొత్త డ్రామా..!

ఆసియా కప్ 2025 భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో హారిస్ ర‌వూప్‌ చేసిన సైగ‌ల‌కు సంబంధించి వీడియో చాలా వైరల్ అయ్యింది.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 3:07 PM IST

ఫైనల్‌కు ముందు పీసీబీ కొత్త డ్రామా..!

ఆసియా కప్ 2025 భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో హారిస్ ర‌వూప్‌ చేసిన సైగ‌ల‌కు సంబంధించి వీడియో చాలా వైరల్ అయ్యింది. హరీస్ బౌండరీపై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు కోహ్లీ-కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత హరీస్ అసభ్యకరమైన సైగలు చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ ర‌వూఫ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. అలాగే.. తుపాకీ సంబరాలు చేపిన‌ సాహిబ్జాదాను కూడా ఐసీసీ హెచ్చరించింది.

ఇప్పుడు ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు ర‌వూప్‌పై చర్యతో కలత చెందిన పాకిస్థాన్.. ఫైనల్‌ను బహిష్కరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది స‌ద్దుమ‌ణిగి ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త డ్రామా మొదలెట్టింది. సమా టీవీ కథనం ప్రకారం.. ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌పై విధించిన జరిమానాను.. తాను వ్యక్తిగతంగా చెల్లించాలనుకుంటున్న‌ట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్న‌ట్లు తెలుస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ఆటగాడికి జరిమానా విధిస్తే.. అది అతని మ్యాచ్ ఫీజు నుండి క‌ట్ అవుతుంది. ఒక ఆటగాడి మ్యాచ్ ఫీజు రూ. 1 లక్ష అయితే.. అతనికి 30 శాతం జరిమానా విధించినట్లయితే, అతనికి కేవలం రూ. 70,000 మాత్రమే లభిస్తుంది. నఖ్వీ ఈ జరిమానా చెల్లించినా.. హరీస్ మ్యాచ్ ఫీజు మినహాయించినట్లు ఐసీసీ రికార్డుల్లో నమోదవుతుంది. అయితే హరీస్ రవూఫ్ వెకిలి చేష్ట‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వ‌గా.. దానిని స‌మ‌ర్ధిస్తున్న పీసీబీ ఛైర్మ‌న్ చ‌ర్య‌ల‌పై కూడా నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Next Story