ప్యాట్ కమిన్స్ విధ్వంసం.. ముంబై పై కోల్‌కతా ఘన విజయం
Pat Cummins smashes joint-fastest fifty in IPL history.ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా
By తోట వంశీ కుమార్ Published on 7 April 2022 9:17 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా దొరికింది. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచులు ఆసక్తికరంగానే సాగుతున్నప్పటికీ.. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ల మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ పసందైన విందును అందించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబైని కోల్‌కతా మట్టి కరిపించింది. పుణెలో కమిన్స్ సృష్టించిన ప్రళయం కారణంగా ముంబైకి మరో ఓటమి తప్పలేదు. 14 బంతుల్లోనే కమిన్స్ అర్థశతకాన్ని సాధించడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలిఉండగానే కోల్‌కతా.. ముంబై పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(52; 36 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో సత్తా చాటగా.. తిలక్ వర్మ(38 నాటౌట్; 27 బంతుల్లో 3పోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (22 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు రోహిత్‌శర్మ(3), ఇషాన్ కిషన్(14) తీవ్రంగా నిరాశపరిచారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్, చక్రవర్తి చెరో వికెట్ తీశారు.
162 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోల్‌కతాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రహానే(7) మరోమారు నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(10), బిల్లింగ్స్(17), నితీశ్‌రానా(8), రస్సెల్(11) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు వెంకటేశ్ అయ్యర్(50 నాటౌట్; 41 బంతుల్లో 6పోర్లు, 1 సిక్స్) కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికి గెలుపు కష్టంగా మారింది. ఈ దశలో అయ్యర్‌కు జత కలిసిన కమిన్స్(56 నాటౌట్; 15 బంతుల్లో 4 పోర్లు, 6 సిక్సర్లు) పెను విధ్వంసమే సృష్టించాడు.
ఓ దశలో కోల్‌కతా 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అయినప్పటికీ 16 ఓవర్‌లోనే విజయాన్ని అందుకుందంటే కమిన్స్ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. సామ్ బౌలింగ్‌లో వరుసగా 6,4,6,6, 2(నోబాల్), 4,6 దంచికొట్టడంతో ఆ ఓవర్‌లో 35 పరుగులు రావడంతో పాటు కోల్‌కతా విజయాన్ని అందుకుంది. కమిన్స్ 14 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో వేగవంతమైన అర్థశతకం సాధించిన రికార్డును అతడు సమం చేశాడు. 2018లో ఢిల్లీపై పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్ కూడా 14 బంతుల్లోనే అర్థశతకం చేశాడు.