కరోనాతో టెన్షన్ పడుతున్న భారత్ కోసం.. ఆ ఆస్ట్రేలియా క్రికెటర్ ఏమి చేశాడో తెలుసా..?
Pat Cummins donates 50,000 to India. ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ భారత్ లో ప్రస్తుత పరిస్థితులను చూసి తనవంతుగా పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్ల విరాళం ప్రకటించాడు.
By Medi Samrat Published on 26 April 2021 5:38 PM ISTభారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు టోర్నమెంట్ ను వీడాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తాము సీజన్ కు అందుబాటులో ఉండమని తేల్చేశారు. ఇప్పుడు ఇంకొంతమంది వీడుతూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ భారత్ లో ప్రస్తుత పరిస్థితులను చూసి తనవంతుగా పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్ల విరాళం ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాళం ప్రకటిస్తున్నట్టు కమిన్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.
భారత్ కు రావడాన్ని ఎంతో ప్రేమిస్తుంటానని.. ఇక్కడివాళ్లు ఎంతో సహృదయులు. ఇంత మంచివాళ్లను నేనెప్పుడూ చూడలేదు. ప్రస్తుతం వీరు అనుభవిస్తున్న వేదన చూసిన తర్వాత నేను తీవ్రంగా విచారిస్తున్నాను. భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కొనసాగించడం సమంజసమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే.... కఠిన లాక్ డౌన్ తరహా ఆంక్షల నడుమ ప్రజలకు ఐపీఎల్ కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తోంది. ఆటగాళ్లుగా మేం ఐపీఎల్ ద్వారా కోట్లాది మందికి చేరువ అవుతున్నాం. ఈ ప్రజాదరణను మేం మంచిపనుల దిశగానూ ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచనతోనే పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటిస్తున్నానని కమిన్స్ తెలిపాడు. దేశంలో ఆక్సిజన్ సరఫరా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నా విరాళాన్ని ఆ దిశగా ఉపయోగించాలని కోరుకుంటున్నానన్నాడు. నేనిస్తున్న విరాళం ఏమంత పెద్దది కాదని తెలుసు కానీ, అది ఏ కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని కమిన్స్ తెలిపాడు.
ఇక ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది. ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై(రాజస్తాన్ రాయల్స్), ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియాకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. అశ్విన్ కూడా ఢిల్లీ కేపిటల్స్ జట్టు నుండి తప్పుకున్నాడు.