ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. మను 221.7 పాయింట్లు గెలుచుకోగా తొలి రెండు స్థానాల్లో దక్షిణ కొరియా ప్లేయర్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఒయె జిన్ 243.2 పాయింట్లతో బంగారం, కిమ్ యెజి 241.3 పాయింట్లతో వెండి పతకాలు సాధించారు. మనూ హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు.
2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా. కాంస్య పతకం సాధించిన షూటర్ మనూ భాకర్‌ని ప్రధాని మోదీ అభినందించారు. దేశానికి మనూ భాకర్ అపురూపమైన విజయాన్ని అందించారని కొనియాడారు. షూటింగ్‌లో తొలిసారి భారత మహిళకు మెడల్ రావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకమని అన్నారు. కేంద్ర మంత్రులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమెను అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు. భారత్ తిరిగి వచ్చేటప్పటికీ ఆమె కోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేస్తానంటూ మనూ అమ్మమ్మ ఆనందం వ్యక్తం చేసింది.