పారిస్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో ఈ సారి రెండంకెల పతకాలు వస్తాయని అంతా భావించారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 7:15 AM GMTపారిస్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో ఈ సారి రెండంకెల పతకాలు వస్తాయని అంతా భావించారు. కొందరు అథ్లెట్లు కచ్చితంగా పతకం సాధిస్తారని అనుకుంటే చివరలో నిరాశ పరిచారు. అయితే.. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలను మించి ఎక్కువ సాధించాలని పారిస్‌వెళ్లిన ఇండియాకు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందలేదు. మరోవైపు అదృష్టం కలిసిరాక అరడజను పతకాలు వస్తాయనుకున్న వేళ.. కేవలం ఆరు పతకాలతోనే పారిస్ ఒలింపిక్స్ ప్రస్థానాన్ని ఇండియా ముగించింది. వీటిల్లో ఒకటి రజతం కాగా.. మిగతా ఐదు పతకాలు కాంస్యాలు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక్క స్వర్ణం కూడా రాలేదు.
పతకాల పరంగా చూస్తే భారత్‌కు ఒలింపిక్స్‌లో నిరాశే అని చెప్పాలి. కానీ.. ప్రదర్శనలో మాత్రం ఏమాత్రం తీసేయలేము. పతకాలు అనుకున్నన్ని సాధించలేకపోయినా ప్రదర్శన మాత్రం గతంలో కంటే మిన్నగా ఉందని చెప్పాలి. ఏడు ఈవెంట్లలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచారు. కొందరు తృటిలో పతకాలు సాధించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా వంటి వారు పతక వేటలో వెనుకబడ్డారు. కచ్చితంగా పతకం సాధిస్తారని అనుకున్న లక్ష్యసేన్, నిఖత్ జరీన్‌లు కూడా నిరాశపర్చారు.
పారిస్ ఒలిపింక్స్‌లో షూటర్స్ ఇండియాకు బాగా కలిసి వచ్చారు. భారత్ సాధించిన తొలి మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చాయి. రెండు కాంస్యాలను 22 ఏళ్ల మనూ భాకర్ గెలిచింది. ఒక దశలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ రజతం గెలుస్తుందని అనుకున్నా.. చివరకు కాంస్యంతో సరిపెట్టుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్తానంలో నిలిచింది. జస్ట్‌లో మరో పతకాన్ని మిస్ చేసుకుంది. ఆర్చరీలో ధీరజ్-అంకిత, షూటింగ్‌లో అనంత్ జీత్- మహేశ్వరీ, బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గెహెయిన్, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్‌లు స్వల్ప తేడాలో పతకాన్ని మిస్ చేసుకున్నారు. గత ఒలింపిక్స్‌లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి రజతానికి పరిమితమయ్యాడు. రెజ్లర్ వినేష్ ఫొగాట్ సైతం ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. కానీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలిపింక్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్లు
1. మను భాకర్ ( 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం)
2. మను భాకర్, సరబ్జోత్ సింగ్ (10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం)
3. స్వప్నిల్ కుశాలే ( 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం)
4. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో రజతం)
5. అమన్ షెరావత్ (రెజ్లింగ్‌లో కాంస్యం)
6. హాకీలో కాంస్యం