7 నెలల గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంది.. ఎప్పుడు బయట పెట్టిందంటే?

ఈజిప్షియన్ ఫెన్సర్ నాడా హాఫెజ్ 7 నెలల గర్భవతి అయినా కూడా ఒలింపిక్స్ లో భాగమైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమె దేశానికి పతకం తీసుకుని రావడానికి పోరాడింది.

By అంజి  Published on  31 July 2024 5:30 AM GMT
Paris Olympics, Egyptian fencer, Nada Hafez, pregnancy

7 నెలల గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంది.. ఎప్పుడు బయట పెట్టిందంటే? 

ఈజిప్షియన్ ఫెన్సర్ నాడా హాఫెజ్ 7 నెలల గర్భవతి అయినా కూడా ఒలింపిక్స్ లో భాగమైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమె దేశానికి పతకం తీసుకుని రావడానికి పోరాడింది. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్‌ మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకుంది. హాఫెజ్ 15-13 తేడాతో టార్టకోవ్‌స్కీ పై గెలిచింది. అయితే 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. హాఫెజ్ ఓడిపోయాక.. ఆమె 7 నెలల గర్భంతో పోటీల్లో పాల్గొందని తెలియడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది.

జూలై 29న హయోంగ్‌తో 15-7 తేడాతో ఓడిపోయిన తర్వాత హాఫెజ్ తన గర్భం గురించి సోషల్ మీడియా ఖాతాలో బయట పెట్టింది. హఫీజ్ కు సాబర్ ఫెన్సింగ్ పట్ల అభిరుచి, అంకితభావానికి ప్రశంసలు అందుకుంది. హయోంగ్‌తో జరిగిన పోరులో కూడా, హఫీజ్ చాలా పోరాట పటిమను కనబరిచింది. అయితే జియోన్ హయోంగ్ అద్భుతంగా ఆడడంతో నాడా హాఫెజ్ కు విజయం దూరమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో తన స్ఫూర్తిదాయక ప్రయాణంలో తన భర్త నుండి తనకు అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపింది.

"ఇంత దూరం రావడానికి నా భర్త, నా కుటుంబమే కారణం.. వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను అదృష్టవంతుడిని. ఈ ఒలింపిక్స్ ఎంతో భిన్నమైనవి. మూడు సార్లు ఒలింపియన్ కానీ ఈసారి ఒక చిన్న ఒలింపియన్‌ను తీసుకువెళుతున్నాను!," అని హాఫెజ్ తెలిపింది. హాఫెజ్ పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు 2016 రియో ​​ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహించింది.

Next Story