అదరగొట్టిన భారత్.. ఘనంగా ముగిసిన పారాలింపిక్స్

పారిస్ వేదిక‌గా ఆగ‌స్టు 28 నుంచి ప్రారంభ‌మైన పారాలింపిక్స్ క్రీడ‌లు ఆదివారం ముగిశాయి.

By Srikanth Gundamalla  Published on  9 Sept 2024 7:45 AM IST
అదరగొట్టిన భారత్.. ఘనంగా ముగిసిన పారాలింపిక్స్

పారిస్ వేదిక‌గా ఆగ‌స్టు 28 నుంచి ప్రారంభ‌మైన పారాలింపిక్స్ క్రీడ‌లు ఆదివారం ముగిశాయి. ఈ వేడుక‌ల్లో భార‌త ప‌తాక‌ధారులుగా ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్‌, అథ్లెట్ ప్రీతి పాల్‌లు వ్య‌వ‌హ‌రించారు. పారాలింపిక్స్‌లో ఈ సారి భార‌త అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టారు. ఏకంగా 29 ప‌త‌కాలు సాధించారు. ఇందులో 7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. గత పారాలింపిక్స్‌ (టోక్యో)లో నెగ్గిన 19 పతకాలే ఇప్పటివరకూ అత్యధికం కాగా... పారిస్‌లో మాత్రం అంతకంటే మరో పది పతకాలు ఎక్కువే సాధించారు. స్విట్జర్లాండ్‌, దక్షిణ కొరియా, అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కినెట్టి 18వ స్థానంలో నిలిచింది భారత్.

భారత్‌కు మొత్తం వచ్చిన పతకాలలో 17 మెడల్స్‌ పారా అథ్లెట్లు తెచ్చినవే. స్వర్ణాల విషయంలోనూ అథ్లెట్లు నాలుగు మెడల్స్ సాధించి.. సత్తా చాటారు. తొలిసారి పారాలింపిక్స్‌లో పాల్గొంటూ దీప్తి జివాంజి, ప్రీతి పాల్‌, శీతల్‌ దేవీ పతకాలను సాధించారు. ఇక వరుసగా రెండు, మూడు ఎడిషన్లలో పాల్గొని సుమిత్‌ అంటిల్‌, అవని లేఖరా, తంగవేలు మరియప్పన్‌ వంటి క్రీడాకారులూ పతకాలను కొల్లగొట్టారు. రెండు చేతులూ లేకున్నా బరిలోకి దిగి కాలితో బాణాలు సంధించిన 17 ఏళ్ల యువ ఆర్చర్‌ శీతల్‌ దేవీ పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ అమ్మాయి దీప్తి 400 మీటర్ల రేసులో కాంస్య పతకాన్ని గెలిచింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌41 కేటగిరీలో నవ్‌దీప్‌ సింగ్‌ బంగారు పతకం సాధించాడు.

కాగా.. చైనా అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత టాప్‌-5లో బ్రిట‌న్‌, అమెరికా, నెద‌ర్లాండ్స్‌, బ్రెజిల్ దేశాలు నిలిచాయి. పారాలింపిక్స్‌ ముగింపు వేడుకలు ఘనంగాయి జరిగాయి. ఈ ముగింపు వేడుక‌ల్లో ఫ్రెంచ్ మ్యూజీషియ‌న్లు, గ్రామీ అవార్డ్ విన్న‌ర్ అండ‌ర్స‌న్ పాక్‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో స్టేడియం హోరెత్తింది.

Next Story