Video : ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లతో బ్యాట్స్‌మెన్ విధ్వంసం..!

హాంకాంగ్ సిక్స‌ర్స్ టోర్నీలో భాగంగా కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్బాస్ అఫ్రిది అరుదైన‌ ఫీట్ చేశాడు.

By -  Medi Samrat
Published on : 7 Nov 2025 5:26 PM IST

Video : ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లతో బ్యాట్స్‌మెన్ విధ్వంసం..!

హాంకాంగ్ సిక్స‌ర్స్ టోర్నీలో భాగంగా కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్బాస్ అఫ్రిది అరుదైన‌ ఫీట్ చేశాడు. యాసిన్ పటేల్ వేసిన ఓవర్లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అబ్బాస్ అఫ్రిది వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అబ్బాస్ 12 బంతుల్లో 55 పరుగులు చేసి కువైట్‌పై పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించంలో కీల‌క పాత్ర పోషించాడు.

అబ్బాస్‌ ఇన్నింగ్స్‌ కారణంగా టోర్నీలో కువైట్‌పై 124 పరుగుల లక్ష్యాన్ని 6 ఓవర్లతో పాక్ జట్టు అందుకోగలిగింది. ఆఖరి బంతికి పాకిస్థాన్ లక్ష్యాన్ని సాధించింది. 24 ఏళ్ల అబ్బాస్ అఫ్రిదికి జూలై 2024 తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడే అవకాశం రాలేదు. బంగ్లాదేశ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్బాస్ జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడు. తాజాగా కువైట్‌పై 12 బంతుల్లో 55 పరుగుల ఇన్నింగ్స్‌తో అబ్బాస్ ఖచ్చితంగా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.

అబ్బాస్ అఫ్రిది తన అరంగేట్రం నుండి 24 T20 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 12.18 సగటు, 112.61 స్ట్రైక్ రేట్‌తో 134 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను పాకిస్థాన్ జాతీయ జట్టుకు దూరంగా ఉండడానికి ఇదే కారణం.

హాంకాంగ్ సిక్సెస్‌ అనేది క్రికెట్‌లో వేగవంతమైన అంతర్జాతీయ టోర్నమెంట్. ఒక్కో ఇన్నింగ్స్‌కు ఆరు ఓవర్లు.. ప్రతి జట్టు నుండి ఆరుగురు ఆటగాళ్లు ఆడతారు. ఇది మొదటిసారిగా 1992లో నిర్వహించబడింది. దీనిని ICC ఆమోదించింది. ఒక్కో మ్యాచ్ పూర్తి కావడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. వికెట్ కీపర్ కాకుండా మిగతా ఆటగాళ్లందరూ కనీసం ఒక ఓవర్ అయినా వేయాలి. ఈ సీజన్‌లో 9 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని మూడు గ్రూపులుగా విభజించారు. నాకౌట్ రౌండ్లు కూడా ఉంటాయి. ఈ టోర్నమెంట్‌ను ఐసీసీ ఆమోదించినందున.. అబ్బాస్ అఫ్రిది అద్భుత ప్రదర్శన అధికారిక రికార్డు పుస్తకాలలో నమోదు చేయబడుతుంది.

Next Story