వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే బెటర్: పాకిస్తాన్ మాజీ ప్లేయర్

టెస్టు మ్యాచ్‌లు.. వన్డేల మ్యాచ్‌లను ఓపిగ్గా చూడలేకపోతున్నారు జనాలు. పొట్టి క్రికెట్‌ రాకతో వాటి కళ తప్పిందనే చెప్పాలి.

By Srikanth Gundamalla  Published on  17 Dec 2023 12:54 PM IST
pakistan, former cricketer, wasim akram,  odi,

వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే బెటర్: పాకిస్తాన్ మాజీ ప్లేయర్

క్రికెట్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. మిగతా ఆటలతో పోలిస్తే దీనుకున్న క్రేజ్‌ వేరు. అయితే.. టెస్టు మ్యాచ్‌లు.. వన్డేల మ్యాచ్‌లను ఓపిగ్గా చూడలేకపోతున్నారు జనాలు. పొట్టి క్రికెట్‌ రాకతో వాటి కళ తప్పిందనే చెప్పాలి. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీ అయితే తప్ప స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ చూసే వాళ్లు కరువవుతున్నారు. ఈ నేపథ్యంలో వన్డేలకు ఒకప్పుడు ఉన్న వైభవం తెచ్చేందుకు పాకిస్తాన్‌ వెటరన్‌ వసీమ్‌ అక్రమ్ ఒక ఐడియా ఇచ్చాడు.

ఈ మేరకు వన్డే క్రికెట్‌ గురించి మాట్లాడిన వసీమ్ అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన దృష్టిలో వన్డేల్లో 10 నుంచి 40 ఓవర్లు పెద్ద సమస్య అని చెప్పాడు. ఈ ఓవర్లలో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేటంతగా ఏమీ జరగదు అన్నాడు. అందుకే వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పుడే ఆట మరింత ఇంట్రెస్టింగ్ మారుతుందని చెప్పాడు. అంతేకాదు.. మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ చూస్తామో? లేదో? అని పాకిస్తాన్‌ లెంజరీ పేసర్‌ వసీమ్ అక్రమ్ కామెంట్ చేశాడు.

వసీమ్ అక్రమ్‌ చేసిన కామెంట్స్‌లో నిజం లేకపోలేదు. ఇప్పుడు పొట్టి క్రికెట్‌ను ఆదరిస్తున్నంతగా.. టెస్టు.. వన్డేలను అభిమానులు చూడటం లేదు. ఎక్కువ సమయం కూర్చొని చూడలేకపోతున్నారు. గతంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే తెలిపాడు. వన్డేలను ఆసక్తిగా మార్చేందుకు ఒక ఐడియా ఇచ్చాడు. 25 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిస్తే.. వన్డే మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతాయని సచిన్ చెప్పాడు. కాగా.. వరుసగా మాజీ క్రికెటర్లు ఇలా చెబుతుండటంతో.. క్రికెట్‌ అభిమానులు కూడా అలా చేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ వన్డేల్లో మార్పులపై స్పందించాల్సి ఉంది.

ఇటీవల భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులు కరువయ్యారు. భారత్‌ మ్యాచ్‌లు తప్ప మిగతా వాటిలో పెద్దగా జనాలు కనిపించలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో స్టేడియంలో జనాలు లేక వెలవెలబోయింది. లీగ్ దశ తర్వాత సెమీస్‌ పోరు ఆసక్తిగా మారడంతో అప్పుడు స్టేడియానికి పోటెత్తారు.

Next Story