భారత బౌలర్లకు ఇచ్చే బంతులపై దర్యాప్తునకు పాక్‌ మాజీ క్రికెటర్ డిమాండ్

టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ అనుమానం వ్యక్తం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 8:47 AM IST
pakistan, former cricketer, doubt,  india bowling

భారత బౌలర్లకు ఇచ్చే బంతులపై దర్యాప్తునకు పాక్‌ మాజీ క్రికెటర్ డిమాండ్

భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ కొనసాగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లోనే ఘన విజయం సాధించింది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తొలి టీమ్‌గా భారత్‌ నిలిచింది. అయితే.. భారత్‌ విజయాలను జీర్ణించుకోలేని కొందరు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ అనుమానం వ్యక్తం చేశాడు.

భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారి బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారని, కానీ టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతర జట్లు ఇబ్బంది పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశాడు పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌మెన్ హసన్ రజా. ఇలా ఎలా జరుగుతుందో అర్థంకావడంలేదని ఆరోపించాడు. ఇటీవల శ్రీలంకపై భారత్‌ ఘన విజయం సాధించింది. కేవలం 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా పేసర్లు షమీ 5 వికెట్లు తీయగా.. సిరాజ్‌ 3.. బుమ్రా, జడేజా చెరోవికెట్ తీశారు. షమీ, సిరాజ్, బుమ్రా అద్భుత స్పెల్‌తో బౌలింగ్‌ చేశారు. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్ల నుంచి భిన్నమైన దూకుడుని చూశామని రజా అన్నాడు. షమీ, సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మాజీ దిగ్గజాలు అలన్ డాలండ్, మఖాయ ఎంతినీ ఆడుతున్నట్లు అనిపించిందని చెప్పాడు. పాకిస్థాన్‌లోని ఓ ఛానల్‌ చర్చలో పాల్గొన్న రజా ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి మారినట్లు కనిపిస్తోందని రజా అనుమానం వ్యక్తం చేశాడు.

భారత బౌలర్లకు ఐసీసీ, బీసీసీఐ వేరే బంతిని అందిస్తున్నాయని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు హసన్ రజా. అందుకే బంతులను తనిఖీ చేయాలని తాను భావిస్తున్నట్టు సూచించాడు. వన్డే మ్యాచ్‌లో మూడు స్లిప్‌లు పెట్టడం, కేఎల్ రాహుల్ కీపర్ కూడా బంతులను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే బంతుల్లో అదనపు ‘లక్క పూత’ ఉందనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశాడు. ఇక హసన్ రజా ఆరోపణలను భారత మాజీ క్రికెటర్లు ఖండించారు. రజా వ్యాఖ్యలు కామెడీగా ఉన్నాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

Next Story