మీకు ధైర్యం ఉంటే పాకిస్థాన్‌కు వ‌చ్చి ఆడండి.. టీమిండియాకు మాజీ క్రికెట‌ర్‌ స‌వాల్‌..!

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి భారత్‌-పాక్‌ల మధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది.

By Medi Samrat  Published on  31 July 2024 8:45 PM IST
మీకు ధైర్యం ఉంటే పాకిస్థాన్‌కు వ‌చ్చి ఆడండి.. టీమిండియాకు మాజీ క్రికెట‌ర్‌ స‌వాల్‌..!

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి భారత్‌-పాక్‌ల మధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది కానీ టీమ్ ఇండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ స్పష్టంగా నిరాకరించింది. అటువంటి పరిస్థితితులో.. పాకిస్తాన్ క్రికెట‌ర్లు స‌వాళ్లు విసురుతున్నారు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని సవాల్ విసిరాడు.

గతేడాది పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉండగా.. బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆ తర్వాత పీసీబీ శ్రీలంకతో జాయింట్ హోస్టింగ్‌లో ఈ టోర్నీని నిర్వహించింది. గతేడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగ్గా.. అందుకోసం పాకిస్థాన్ జట్టు ఇండియాకు వచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని కోరుతున్నారు. అయితే దీనిని పీసీబీ అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన్వీర్ చాలా దూకుడుగా ప్రకటనలు చేసి భారత జట్టుకు సవాల్ విసిరాడు.

'మేం సింహాలమే.. మేం మీ ఇంటికి వ‌చ్చి ఆడాం. మీకు ధైర్యం ఉంటే.. ఇక్కడికి వచ్చి ఆడండి.. మీకు భద్రత కల్పిస్తాం.. అన్నీ ఇస్తాం.. ఒక్కసారి రండి.. పాకిస్థానీ ఆటగాళ్లు దీన్నే శౌర్యం అంటారని స‌వాల్ విసిరారు.

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలు సరిగా లేవు. అందుకే తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ వెనుకాడుతోంది. 2008 నుంచి టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ముంబైలో ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని తరచూ ఆరోపణలు వస్తున్నాయి.

2009లో పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పటి నుంచి పాకిస్థాన్‌లో చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జ‌రుగ‌లేదు. 2017లో మాత్రమే శ్రీలంక పాకిస్థాన్‌లో పర్యటించింది. ఏడాది తర్వాత వెస్టిండీస్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. అప్పటి నుండి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జ‌రుగుతున్నాయి.

Next Story