తొలి ఓవర్లోనే 4 వికెట్లు..రికార్డు సృష్టించిన పాక్‌ బౌలర్

పాకిస్థాన్ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 12:10 PM IST
pakistan, bowler, shaheen afridi, Record T20

తొలి ఓవర్లోనే 4 వికెట్లు..రికార్డు సృష్టించిన పాక్‌ బౌలర్

పాకిస్థాన్ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్‌ డకౌట్‌లు ఉన్నాయి.

పాకిస్థాన్‌ అంటేనే ఫాస్ట్‌ బౌలర్లకు పేరు. ఇప్పటి వరకు పాకిస్థాన్‌ నుంచి ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ బౌలర్లు వచ్చారు. వేగం, స్వింగ్‌, రివర్స్‌ స్వింగ్‌, యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించేవారు. తాజాగా పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షహీన్ అఫ్రిదీ తనదైన మెరుపు వేగంతో రికార్డు సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో సరికొత్త ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్‌ 2023 టోర్నీ జరుగుతోంది. ఈ క్రమంలో నాటింగ్‌ హామ్, వార్విక్‌ షైర్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లోనే రికార్డు నెలకొల్పాడు షహీన్ అఫ్రిదీ. నాటింగ్ హామ్‌ తరఫున షహీన్ ఆడుతున్నాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే 4 వికెట్లను తీసుకున్నాడు. తొలి బంతికి అలెక్స్‌ డెవిస్‌ డకౌట్, రెండో బంతికి క్రిస్ బెంజమిన్‌ను డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇక మూడో బంతి వికెట్‌ పడకపోవడంతో హ్యాట్రిక్ మిస్‌ అయ్యాడు. ఐదో బంతికి డాన్‌ మౌస్లి (1), చివరి బాల్‌కు ఎడ్‌ బార్నార్డ్‌ను డకౌట్‌ చేశాడు షహీన్ అఫ్రిదీ. నాలుగు వికెట్లు తీయగా అందులో 3 డకౌట్లు ఉండటం విశేషం.

మ్యాచ్‌లో వార్విక్‌ షైర్ టాస్‌ గెలిచి బౌలింగ్ తీసకుంది. తొలుత నాటింగ్‌ హామ్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 168 పరుగులు చేసింది.ఆ తర్వాత వార్విక్‌ షైర్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 ఓవర్లు వేసిన షహీన్ 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కానీ షహీన్ వేసిన తొలి ఓవర్‌ మాత్రం రికార్డు నెలకొల్పింది.

Next Story