పాకిస్తాన్ సంతతికి చెందిన క్లబ్ స్థాయి క్రికెటర్ జునైల్ జాఫర్ ఖాన్ కాంకోర్డియా కాలేజీలో జరిగిన స్థానిక మ్యాచ్ సందర్భంగా కుప్పకూలి మరణించాడు. 40 ఏళ్ల వయసు ఉన్న జునైల్ జాఫర్ ఖాన్ గత శనివారం ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 40 ఓవర్లు ఫీల్డింగ్ చేసిన జునైల్ జాఫర్ ఖాన్, ఆ తర్వాత బ్యాటింగ్ లో ఏడు పరుగులు చేసిన తర్వాత ఆస్ట్రేలియన్ సెంట్రల్ డేలైట్ టైమ్ (ACDT) ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయాడు. పారామెడిక్స్ ఎంత ప్రయత్నించినా, అతను దురదృష్టవశాత్తు బ్రతకలేదని తెలిపారు.
ఈ మ్యాచ్ ఆడిన సమయంలో విపరీతమైన వేడి ఉంది. దక్షిణ ఆస్ట్రేలియాలో తీవ్రమైన వేడి ఉంది. బ్యూరో ఆఫ్ మెటియాలజీ డేటా ప్రకారం, ఆ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే మ్యాచ్ ను రద్దు చేయొచ్చని అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనలు చెబుతున్నాయి.
"ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్‌లోని విలువైన సభ్యుడు మరణించడం పట్ల మేము చాలా బాధపడ్డాము, ఈరోజు కాన్కార్డియా కాలేజ్ ఓవల్‌లో ఆడుతున్నప్పుడు విషాదకరంగా చనిపోయాడు" అని ఖాన్ ఆడుతున్న క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీ పరిశ్రమలో పనిచేయడానికి ఖాన్ 2013లో పాకిస్తాన్ నుండి అడిలైడ్‌కు వెళ్లినట్లు సమాచారం.