Inida Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై గెలుపు

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2024 8:45 AM IST
olympics, hockey, team india, won,   australia,

Inida Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై గెలుపు

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది. రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడిపోయిన తర్వాత భారత హాకీ జట్టు తిరిగి పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన ఆస్ట్రేలియాపై విజయాన్ని అందుకుంది. తద్వారా క్వార్టర్స్‌కు అర్హతను సాధించింది. తమ చివరీ లీగ్‌ మ్యాచ్‌లో ఇండియా 3-2తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ 52 ఏళ్ల తర్వాత గెలిచింది. చివరి సారిగా 1972లో మునిచ్‌లో విజయాన్ని అందుకుంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతూ దారుణంగా ఓడిపోయింది టీమిండియా. కానీ.. ఇప్పుడు కీలకమైన పోరులో మాత్రం అద్భుతంగా రాణించింది. 12వ నిమిషంలోనే అభిషేక్‌ తొలి గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. వాస్తవానికి గోల్‌ చేసేందుకు లలిత్‌ బంతిని గోల్‌ పోస్ట్‌ వైపునకు పంపాలని యత్నించినా ప్రత్యర్థి గోల్‌కీపర్‌ ఆండ్రూ చార్టర్‌ దానిని అడ్డుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అభిషేక్‌ బంతిని దొరకబుచ్చుకుని రాకెట్‌ వేగంతో దానిని గోల్‌పోస్ట్‌కు పంపించాడు. ఆ వెంటనే 13వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఈ టోర్నీలో తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

ఆస్ట్రేలియాకూ పలుమార్లు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ.. చివరి ఒలింపిక్స్‌ ఆడుతున్న గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ వాటిని అడ్డుకుని ఇండియా గెలుపులో కీలకం అయ్యాడు. 25వ నిమిషంలో టామ్‌ క్రెయిగ్‌ గోల్‌ కొట్టి ఖాతా తెరిచి ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు. కానీ మూడో క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్‌ 33వ నిమిషంలో మరోసారి లభించిన పెనాల్టీ కార్నర్‌ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుని భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు. 55వ నిమిషంలో బ్లేక్‌ గోవర్స్‌ గోల్‌ కొట్టినా అది ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఈ విజయంతో భారత్‌ పూల్‌-బీలో లీగ్‌ దశను రెండో స్థానం (9 పాయింట్లు)తో ముగించింది. బెల్టియం (12) అగ్రస్థానంలో ఉంది.

Next Story