World Cup-2023: అక్షర్‌ పటేల్‌ స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు అక్షర్‌ పటేల్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌కు అవకాశం దక్కింది.

By Srikanth Gundamalla  Published on  29 Sep 2023 1:41 AM GMT
ODI World cup-2023, Team India, Axar patel, Ashwin,

World Cup-2023: అక్షర్‌ పటేల్‌ స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌

ఆసియా కప్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయపడ్డాడు. దాంతో.. ఆ టోర్నో ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా అక్షర్‌ దూరమైన విషయం తెలిసిందే. అయితే.. అక్షర్‌ పటేల్‌ ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేదు. తొడ కండరం గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందట. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు అక్షర్‌ పటేల్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌కు అవకాశం కల్పించారు బీసీసీఐ ప్రతినిధులు.

వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఈనెల 5న బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అక్షర్‌ పటేల్‌ ఉన్నాడు. అక్షర్‌ పటేల్‌ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాలు పట్టే అవకాశం ఉండటంతో వన్డే ప్రపంచకప్‌ కోసం అతని స్థానంలో సీనియర్‌ స్పిన్నర్, తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియాతో టీమిండియా ఇటీవల మూడు వన్డేల సిరీస్‌ ఆడింది. ఈ మ్యాచుల్లో రెండు వన్డేలు ఆడిన అశ్విన్ మంచి స్పెల్‌తో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

కాగా.. శనివారం ఇంగ్లండ్‌తో గుహవాటి వేదికగా వామప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈమ్యాచ్‌లో ఆడేందుకు అశ్విన్‌ వెళ్లాడు. అశ్విన్‌కు ఇది మూడో వన్డే వరల్డ్‌ కప్‌ కానుంది. స్వదేశంలో ధోనీ సారధ్యంలో 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ నెగ్గిన భారత జట్టులో కూడా అశ్విన్‌ ఉన్నాడు. 2015లో కూడా వరల్డ్‌ కప్‌ టీమిండియాలో ఉన్నాడు. కాగా.. అశ్విన్‌ ఇప్పటివరకు మొత్తం 115 వన్డేలు ఆడగా.. 155 వికెట్లు తీశాడు. అంతేకాదు.. బ్యాటింగ్‌లో కూడా తగ్గేదే లేదు అన్నట్లుగార 707 పరుగులు చేశాడు. అక్టోబర్‌ 5 నుంచి మొదలయ్యే ప్రపంచకప్‌ కోసం తుది జట్లలో మార్పులు చేర్పులకు గురువారంతో గడువు ముగిసింది.

మరోవైపు ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ టీమ్‌లోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. పిక్క కండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ ఆస్టర్ అగర్‌ ఇంకా కోలుకోలేదు. దాంతో.. అతడి స్థానంలో మార్నస్ లబుషేన్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.

Next Story