టెన్నిస్ దిగ్గజం జకోవిచ్‌కు భారీ షాక్.. మరోసారి వీసా రద్దు
Novak Djokovic's Visa Cancelled By Australia For Second Time.టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్-1 ఆటగాడు
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 2:28 PM IST
టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్-1 ఆటగాడు నోవాక్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మరోసారి అతడి వీసాను రద్దు చేసింది. అంతేకాదు ఈ టెన్నిస్ స్టార్ పై మూడేళ్ల పాటు నిషేదం కూడా విధించింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ సాధించాలన్న జకోవిచ్ కలకు పెద్ద అడ్డంకి ఏర్పడింది. మరో మూడేళ్ల పాటు అతడు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. కరోనా నిబంధనలు పాటించనందుకు అతడి వీసాను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలోనే జకోవిచ్ వీసాను రద్దు చేస్టున్నట్లు చెప్పారు. అందుకు తన పూర్తి విచక్షణాధికారాలను ఉపయోగించినట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు జకోవిచ్ ఈ నెల(జనవరి) 5న మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. అతడి వద్ద వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అతడి వీసాను రద్దు చేసి ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అయితే.. ఈ దీనిపై జకోవిచ్ కోర్టుకెక్కాడు. వాదనలు విన్న కోర్టు జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జకోవిచ్ వీసాను పునరుద్దరించాలని, వెంటనే అతడిని డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో హోటల్ చేరుకున్న జకోవిచ్ ఈ నెల 17 ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేశారు.