టెన్నిస్ స్టార్‌కు షాక్.. వీసా ర‌ద్దు.. 8 గంట‌లు ఎయిర్‌పోర్టులోనే

Novak Djokovic visa cancelled.టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు, సెర్బియా స్టార్ నోవాక్ జ‌కోవిచ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 3:29 AM GMT
టెన్నిస్ స్టార్‌కు షాక్.. వీసా ర‌ద్దు.. 8 గంట‌లు ఎయిర్‌పోర్టులోనే

టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు, సెర్బియా స్టార్ నోవాక్ జ‌కోవిచ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అత‌డి వీసాను ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు బుధ‌వారం అర్థ‌రాత్రి జ‌కోవిచ్ మెల్‌బోర్న్‌కు చేరుకున్న అనంత‌రం ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు జ‌కోవిచ్‌ను అడ్డుకున్నారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లుగా త‌గిన ప‌త్రాలు స‌మ‌ర్పించ‌ని కార‌ణంగా అత‌డిని నిలువ‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. అత‌డి వీసా ర‌ద్దు చేయ‌డంతో దాదాపు 8 గంట‌ల పాటు ఈ సెర్బియా ఆట‌గాడు విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.

టెన్నిస్ దిగ్గజ ఆటగాడిని ఎయిర్‌పోర్టులో దాదాపు 8 గంటలకు పైగా ఆపడంపై సెర్బియా ప్రభుత్వం మండిపడింది. దిగ్గజ ఆటగాడిని అవమానించారని సెర్బియా ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇప్ప‌టికే జ‌కోవిచ్‌తో మాట్లాడామ‌ని.. దేశం మొత్తం అత‌డికి అండ‌గా ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. ఇక ఈ విష‌యంపై ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ స్పందించారు. క‌రోనా నిబంధ‌న‌లు అంద‌రూ ఖ‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని అన్నారు. ఇందుకు ఎవ్వ‌రికి మిన‌హాయింపులేద‌న్నారు. క‌రోనా టీకా తీసుకోకుండా వైద్యపరంగా మినహాయింపు ఉందని నిరూపించలేకపోతే జ‌కొవిచ్‌ను తదుపరి విమానంలో పంపుతామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా జకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్ప‌టికే జ‌కోవిచ్ 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు.

Next Story