జకోవిచ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. షాకిచ్చిన కోర్టు.. ఇంటికెళ్లాల్సిందే
Novak Djokovic loses appeal against Australia visa cancellation.టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్-1, సెర్బియా స్టార్
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2022 9:42 AM GMTటెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్-1, సెర్బియా స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి కెరీర్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకుని రికార్డు సృష్టించాలనుకున్న అతడి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆస్ట్రేలియా మంత్రి రద్దు చేసిన వీసాను పునరుద్దరించాలని జకోవిచ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ కోర్టు కొట్టేసింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు జకోవిచ్‌కు వీలులేకుండా పోయింది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు జకోవిచ్ ఈ నెల(జనవరి) 5న మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. అతడి వద్ద వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అతడి వీసాను రద్దు చేసి ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అయితే.. ఈ దీనిపై జకోవిచ్ కోర్టుకెక్కాడు. వాదనలు విన్న కోర్టు జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జకోవిచ్ వీసాను పునరుద్దరించాలని, వెంటనే అతడిని డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ క్రమంలో హోటల్ చేరుకున్న జకోవిచ్ ఈ నెల 17 ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేశారు. దీంతో రెండోసారి జకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు. అయితే.. ఈ సారి అతడికి నిరాశే ఎదురైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీంతో డిఫెండింగ్ చాంపియన్ అయిన నోవాక్ జకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడకుండానే వెనుదిరగనున్నాడు. ఈ విషయంపై జకోవిచ్ స్పందించాడు. 'తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే న్యాయస్థానం నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను దేశాన్ని వీడటానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తా.' అని చెప్పాడు. వీసా రద్దు కావడంతో అతడు దాదాపు మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే వీలులేదు.