ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఉచితంగా మ్యాచ్‌లు చూడలేమా.?

భారత్‌లో క్రికెట్‌లో అతిపెద్ద పండుగగా చెప్పుకునే ఐపీఎల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on  14 Feb 2025 6:17 PM IST
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఉచితంగా మ్యాచ్‌లు చూడలేమా.?

భారత్‌లో క్రికెట్‌లో అతిపెద్ద పండుగగా చెప్పుకునే ఐపీఎల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు భారతీయ అభిమానులకు ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ వ‌చ్చింది. గతేడాది లాగా ఇప్పుడు అభిమానులు జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడలేరంటూ కొన్ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. అలాగే మరొక లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ హాట్‌స్టార్‌లో కూడా ఉచిత స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉండదనేది వార్త‌ల సారాంశం.

దీనికి కారణం జియో, హాట్‌స్టార్ విలీనం.. ఇది ఇప్పుడు జియోహాట్‌స్టార్ అని పిలువబడుతుంది. ఈ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ శుక్రవారం ప్రారంభించబడింది. అయితే దీనికి సంబంధించిన సన్నాహాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అయితే ఈ విలీనం భారత్‌లో IPL ఉచిత ప్రత్యక్ష ప్రసార హక్కును కూడా తీసివేసిందనే వార్త‌లు వెలువ‌డుతున్నాయి.. అదే జ‌రిగితే ఇది నిజంగా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సభ్యత్వం లేని అభిమానులు కొద్దిసేపు మాత్ర‌మే మ్యాచ్‌ను ఆస్వాదించగలరు. ఉచిత నిమిషాలు ముగిసిన తర్వాత వారు రూ. 149 ప్లాన్‌తో రిఛార్జ్ సబ్‌స్క్రిప్షన్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.

2023లో Jio సినిమా IPL ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందింది. ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా మ్యాచ్‌లను ప్రదర్శిస్తోంది. కానీ 2025 ప్రారంభం నుండి అభిమానులు చందా చెల్లించి మ్యాచ్‌లను చూడవలసి ఉంటుంది. ముఖేష్ అంబానీకి చెందిన వాల్ట్ డిస్నీని రిలయన్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఐపీఎల్ స్ట్రీమింగ్‌ను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

జియోహాట్‌స్టార్ ఇప్పుడు భారత క్రికెట్ వీక్షకులకు కొత్త ప్లాట్‌ఫారమ్ అవుతుంది. ICC ఈవెంట్‌ల నుండి IPL, WPL మ్యాచ్‌లు ఇందులో వస్తాయి. దీంతోపాటు భారత్ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను కూడా ఇందులో ఉంటాయి. క్రికెట్‌తో పాటు ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రొ కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ మ్యాచ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

వాల్ట్ డిస్నీ కొన్ని సంవత్సరాల క్రితం హాట్‌స్టార్, స్టార్‌లను కొనుగోలు చేసింది. అప్పటి నుండి దాని పేరు డిస్నీ హాట్‌స్టార్‌గా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అయితే.. దాని లైవ్ స్ట్రీమింగ్ యాప్ అంటే డిస్నీ హాట్‌స్టార్ కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను చూపించేది.

2023 సంవత్సరంలో IPL తన మీడియా హక్కుల వేలంలో TV ప్రసారం, లైవ్ స్ట్రీమింగ్‌ కోసం ప్రత్యేక బిడ్‌లు వేయ‌గా.. స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కులు, ప్రత్యక్ష ప్రసార హక్కులను Jio కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు.

WPL నేటి నుంచి ప్రారంభం కానుండ‌గా.. IPL వ‌చ్చే నెల ప్రారంభ‌మ‌వ‌నుంది. ఈ లోపు ఉచిత స్ట్రీమింగ్‌పై ఏదైనా నిర్ణ‌యం వెలువ‌డుతుందేమో చూడాలి.

Next Story