పతకాల పంట పండిస్తున్న భారత క్రీడాకారులు
Nitu Ganghas, Amit Pangal won gold indian women hockey team beat Newzealand in bronze medal contest. ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.
By అంజి
ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కిలోల విభాగంలో ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ జేడ్‌పై గెలిచి భారత యువ బాక్సర్ నీతు గంగాస్ గోల్డ్ మెడల్ సాధించింది. పురుషుల 51 కిలోల విభాగంలో కియరన్ మెక్ డొనాల్డ్‌పై అమిత్ పంగల్ విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
మరో వైపు కాంస్య పోరులో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆటలో భారత జట్టు.. 2-1 (1-1) తేడాతో గెలుపును అందుకుని కాంస్యాన్ని సాధించింది. కాంస్య పోరులో భారత్ జట్టు మొదటి క్వార్టర్‌లోనే తొలి గోల్ కొట్టింది. సలీమా తెటె గోల్ చేసి భారత్‌కు 1 - 0 ఆధిక్యాన్ని అందించగా, ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు ఆట ముగస్తుందనగా ఒలివియా గోల్ కోట్టింది. దీంతో స్కోర్ 1 - 1తో సమమైంది. డ్రా కావడంతో మ్యాచ్ ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూట్ అవుట్‌ను ఆడారు. ఇందులో భారత్ రెండు గోల్స్ కొట్టగా, న్యూజిలాండ్ ఒక్క గోల్ మాత్రమే చేసింది. భారత కెప్టెన్, గోల్ కీపర్ సవితా పునియా న్యూజిలాండ్ ఆటగాళ్ల గోల్స్‌ను అడ్డుకున్నారు.
ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
స్టార్ బ్యాడ్మింటన్, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూర్) ను ఓడించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్‌లలో జియాను ఓడించిన సింధు.. ఫైనల్స్‌లో బంగారు పతకం మీదే దృష్టి పెట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్ విభాగంలో ఆమెకు ఇది రెండో పతకం కానుంది. కామన్వెల్త్ క్రీడలలో ఇప్పటివరకు మొత్తంగా భారత్ 43 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 15 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలున్నాయి.
ట్రిపుల్ జంప్‌లో అదరగొట్టిన అథ్లెట్లు
భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటారు. ఆదివారం జరిగిన ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఏకంగా గోల్డ్, సిల్వర్ కూడా మనకే దక్కింది. కాస్త మిస్ అయినా.. నాలుగో స్థానం కూడా మనదే. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఎల్డోస్ పాల్.. 17.03 మీటర్లు దూకి గోల్డ్ సాధించాడు. పాల్‌తో పాటు అబ్దుల్లా అబూబాకర్.. 16.92 మీటర్లు దూకి రజతం నెగ్గాడు. అయితే అతడు తన తొలి ప్రయత్నంలో ఏకంగా 17.2 మీటర్లు దూకాడం విశేషం. అలాగే 10 వేల మీటర్ల నడక రేస్‌లో పాల్గొన్న 36 ఏళ్ల భారత అథ్లెట్ సందీప్ కుమార్.. తన వ్యక్తిగత రికార్డును బద్దలుకొట్టి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.