26 బంతుల్లో 12 సిక్సర్లతో నికోల‌స్ పూరన్ విధ్వంసం

Nicholas Pooran Smashes 89 Off 26 Balls.దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2021 11:54 AM GMT
Nicholas Pooran Smashes 89 Off 26 Balls

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. లీగ్‌లో నార్త‌ర్న్ వారియ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ విండీస్ ఆట‌గాడు బంగ్లా టైగ‌ర్స్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 26బంతుల్లోనే 12 సిక్స‌ర్లు బాది 89 ప‌రుగులు చేశాడు. కేవ‌లం 17 బంతుల్లో అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు.

ఆదివారం నార్త‌ర్న్ వారియ‌ర్స్‌, బంగ్లా టైగ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నార్త‌ర్న్ వారియ‌ర్స్ ‌కు ఓపెనర్ వసీమ్ మహమ్మద్ తొలి ఓవర్లలోనే రెండు సిక్సులు బాది శుభారంభాన్ని అందించాడు. అయితే 12 పరుగులు చేసిన తర్వాత వసీం ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. మ‌రో ఓపెన‌ర్‌ లెండి సిమ్మన్స్(41) క‌లిసి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. సిక్స‌ర్‌తో ఖాతా తెరిచిన ఈ విండీస్ వీరుడు స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 17 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. టీ10 లీగ్‌లో పూర‌న్‌కు ఇది ఐదో అర్థ‌శ‌త‌కం. ఆ త‌రువాత మ‌రింత ధాటిగా బ్యాటింగ్ చేస్తూ.. శ‌త‌కం దిశ‌గా దూసుకెళ్తున్న పూర‌న్‌ను కరీమ్ జనత్ పెవిలియ‌న్ చేర్చాడు. పూర‌న్ విధ్వంసంతో నార్త‌ర్న్ వారియ‌ర్స్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. లీగ్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు.

అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లా టైగర్స్​ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఆండ్రూ ఫ్లెచర్ (53), చిరాగ్ సూరి( 42)రాణించినా ఫలితం లేకపోయింది. దీంతో నార్త‌ర్న్ వారియ‌ర్స్ 30 ప‌రుగ‌ల తేడాతో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా నికోల‌స్ పూర‌న్ రికార్డు సృష్టించాడు.


Next Story
Share it