నికోలస్ పూరన్.. ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం అతడితో బ్యాడ్ లక్ ఓ ఆటాడుకుంటూ ఉంది. ఎంతలా అంటే నాలుగు మ్యాచ్ లు ఆడిన పూరన్ ఏకంగా మూడు మ్యాచ్ లలో డకౌట్ అయ్యాడు. అది కూడా అన్ని రకాల డకౌట్ లు అయ్యాడు. గోల్డెన్ డకౌట్, సిల్వర్ డకౌట్, డైమండ్ డకౌట్ లు గా పూరన్ వెనుదిరిగాడు. అతడి వైఫల్యం పంజాబ్ కింగ్స్ జట్టుపై భారీగా పడుతోంది. మెుదటిగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో స్కోరును పెంచాలనే ఉద్దేశ్యంతో మొదటి బంతిని బలంగా బాధినప్పటికీ చేతన్ సకారియా అద్భుతమైన క్యాచ్ కారణంగా పూరన్ పెవిలియన్ చేరాడు.
తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులను మాత్రమే ఆడి పెవిలియన్ చేరాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఔటై వెనుదిరిగాడు. 8 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కొకుండానే రనౌటయ్యాడు. దీన్నే డైమండ్ డక్ అంటారు. అతను ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పూరన్ టచ్ లోకి వచ్చాడంటే భారీ హిట్టింగ్ మొదలవుతుంది. కానీ అతడిని ఈ ఏడాది ఐపీఎల్ లో దురదృష్టం బాగా వెంటాడుతూ ఉంది. తర్వాతి మ్యాచ్ లలో అయినా పూరన్ రాణిస్తాడో.. లేక ఇంకొన్ని మ్యాచ్ లలో చూసి అతడిని ఫ్రాంచైజీ పక్కన పెడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంది.