హెడ్‌ కోచ్‌గా ముగిసిన ద్రవిడ్‌ పదవీకాలం.. లక్ష్మణ్‌కే ఆ బాధ్యతలు..!

వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎవరనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  24 Nov 2023 2:09 AM GMT
team india, next head coach, vvs laxman,

 హెడ్‌ కోచ్‌గా ముగిసిన ద్రవిడ్‌ పదవీకాలం.. లక్ష్మణ్‌కే ఆ బాధ్యతలు..!

వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎవరనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి. అయితే..దానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ రెండేళ్ల కాంట్రాక్టు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ను మరోసారి హెడ్‌ కోచ్‌గా నియమిస్తారనే ప్రచారం జరిగింది. కానీ..ఆయన అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

రాహుల్‌ ద్రవిడ్‌ రాబోయే కాలంలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు ఆసక్తిగా లేనట్లు వెల్లడించారు. తాను పూర్తిస్థాయి కోచ్‌గా కొనసాగేందుకు ఇష్టపడటం లేదని.. ఈ విషయం ద్రవిడ్ స్వయంగా బీసీసీఐకి తెలిపాడు. దాంతో.. టీమిండియా తర్వాతి హెడ్‌ కోచ్‌గా తెలుగు క్రికెటర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ నియామకం దాదాపు ఖరారు అయ్యింది. నవంబర్‌ 23న ప్రారంభం అయ్యిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో లక్ష్మన్‌ తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు కూడా రాహుల్‌ ద్రవిడ్‌ హాజరుకాలేదు. దాంతో.. ఆయన హెడ్‌కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తిగా లేరని.. మరొకరు అంటే వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆ బాధ్యతలను తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అహ్మాదాబాద్‌కు వెళ్లాడు వీవీఎస్ లక్ష్మణ్. అక్కడ బీసీసీఐ పెద్దలను కలిశాడు. తాను టీమిండియా హెడ్‌కోచ్‌ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. సౌతాఫ్రికా టూర్‌తో లక్ష్మణ్‌ పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుంటారని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. కాగా.. లక్ష్మణ్‌ కోచ్‌గా భారత యువ ఆటగాళ్ల జట్టు ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక ద్రవిడ్ విషయానికి వస్తే.. రెండేళ్ల పదవి కాలంలో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. వీటిలో 2023 లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓడినా.. హెడ్‌ కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌పై మాత్రం ఎలాంటి విమర్శలు రాలేదు.

Next Story