క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మెన్
న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 8 Jan 2025 9:15 PM ISTన్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్టిల్ 2009 నుండి 2022 వరకు అంటే 14 సంవత్సరాల వరకు న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలందించారు. అతడు 367 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గుప్టిల్ అంతర్జాతీయ స్థాయిలో 23 సెంచరీలు చేసి వైట్ బాల్ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్టిన్ గప్టిల్ నిలిచాడు. 122 మ్యాచ్‌ల్లో 3,531 పరుగులు చేశాడు. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్‌మెన్ జాబితాలో కూడా నిలిచాడు. గప్టిల్ ODIలలో 7,346 పరుగులు చేశాడు. రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
మార్టిన్ గప్టిల్ 2009లో తన అరంగేట్రం ODIలో సెంచరీ చేసిన మొదటి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా గప్టిల్ నిలిచాడు. ఈడెన్ పార్క్‌లో వెస్టిండీస్‌పై ఈ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది చివర్లో అతడు ICC వరల్డ్ ODI XIలో చోటు సంపాదించాడు.
మార్టిన్ గప్టిల్ తన కెరీర్‌లో 2015 ODI ప్రపంచ కప్‌లో క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌తో సహా అనేక చిరస్మరణీయ ప్రదర్శనలు చేశాడు. ఆ తర్వాత వన్డేల్లో గప్టిల్ వెస్టిండీస్‌పై 237 పరుగుల వ్యక్తిగత స్కోరు రికార్డు బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ తరఫున గప్టిల్ వన్డేల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరర్. ఇది కాకుండా గప్టిల్ 47 టెస్టు మ్యాచ్‌ల్లో 2,586 పరుగులు చేశాడు.
చిన్నతనంలో న్యూజిలాండ్‌కు ఆడాలని కలలు కన్నానని, దేశం తరఫున 367 మ్యాచ్‌లు ఆడడం తన అదృష్టమని గప్టిల్ చెప్పాడు. ఈ సందర్భంగా తన సహచరులు, కోచ్‌లకు గప్టిల్ ధన్యవాదాలు తెలిపాడు. గప్టిల్ తన కుటుంబానికి, న్యూజిలాండ్ క్రికెట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. న్యూజిలాండ్‌కు ఆడాలనేది చిన్నపిల్లాడిగా ఉన్నప్పటినుంచి నా కల. 367 మ్యాచ్‌ల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నాను అని అన్నాడు.