మిచెల్ మెరుపులు.. ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

New Zealand beat England to enter final.న్యూజిలాండ్‌ ల‌క్ష్యం 167 ప‌రుగులు. 13 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 7:58 AM IST
మిచెల్ మెరుపులు.. ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ ల‌క్ష్యం 167 ప‌రుగులు. 13 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు చేసింది 58 ప‌రుగులే. ఇలాంటి స్థితిలో గెలుపు సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క‌నీసం గౌర‌వ‌ప్ర‌దంగా ఓడ‌డం కూడా క‌ష్టమే. అయితే.. ఈ స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుంది కివీస్‌. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని ఇంకా ఓ ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే మ్యాచ్‌ను గెలిచి ఫైన‌ల్ చేరింది కివీస్‌. త‌ద్వారా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్‌లో త‌మ‌కు ఎదురైన ప‌రాభ‌వానికి ఘ‌నంగా ప్ర‌తికారం తీర్చుకుంది కివీస్‌. ఈ ఏడాది టెస్ట్ ఛాంఫియ‌న్‌గా అవ‌రించిన కివీస్‌.. టీ20 చాంఫియ‌న్ గా నిలిచేందుకు కేవ‌లం ఒకే ఒక్క విజ‌యం దూరంలో ఉంది.

అబుదాబి వేదిక‌గా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్ అస‌లు సిస‌లు టీ20 మ‌జా ఎంటో రుచి చూపించింది. ఆశ‌లే లేని స్థితిలోంచి కివీస్ బ్యాట్స్‌మెన్లు పట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లాగా పోరాడి విజ‌యాన్ని చేజిక్కించుకున్నారు. 167 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్‌కు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ మార్టిన్‌ గప్టిల్‌(4)తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(5) త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు. దీంతో కివీస్ 13 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శలో కాన్వె(46)తో క‌లిసి మ‌రో ఓపెన‌ర్ డారెన్ మిచెల్ (48 బంతుల్లో 73 నాటౌట్‌, 4ఫోర్లు, 4సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. ఇద్ద‌రూ ఆచితూచి ఆడారు. ఇంగ్లాండ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండ‌డంతో ప‌రుగులు రావ‌డం కష్టంగానే మారింది. సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో కాన్వె భారీ షాట్‌కు య‌త్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 82 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర ప‌డింది. ఆ తర్వాత ఫిలిప్స్‌(2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.

ఆఖ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ విజ‌యానికి 57 ప‌రుగులు కావాలి. ఇంగ్లాండ్ బౌలింగ్ చూస్తుంటే.. కివీస్ విజ‌యం క‌ష్ట‌మే అనిపించింది. అయితే.. స‌రిగ్గా ఈ ద‌శ‌లో ఆల్‌రౌండ‌ర్ జేమ్స్ నీషమ్‌(11 బంతుల్లో 27, ఫోర్‌, 3 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 17వ‌ ఓవ‌ర్‌లో జోర్డాన్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్‌లు, ఫోర్ బాద‌డ‌పంతో ఆ ఓవ‌ర్‌లో 23 ప‌రుగులు వ‌చ్చాయి. స‌మీక‌ర‌ణం 18 బంతుల్లో 34గా మారింది. అదే జోరులో రషీద్‌ బౌలింగ్‌లో 14 పరుగులు రావ‌డంతో పాటు ఆ ఓవ‌ర్ చివ‌రి బంతికి నీష‌మ్ ఔట్ కావ‌డంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆశ‌లు చిగురించాయి. కివీస్ విజ‌యానికి 12 బంతులకు 20 ప‌రుగులు కావాలి. అప్ప‌టి వ‌ర‌కు చాలా ఓపిక‌గా ఆడిన మిచెల్ 19 ఓవ‌ర్‌లో త‌న‌లోని విధ్వంస‌కారుడిని బ‌య‌ట‌పెట్టాడు. వోక్స్ వేసిన 19వ ఓవ‌ర్ రెండ‌వ‌, మూడ‌వ బంతుల‌ను సిక్స్‌లుగా మ‌లిచాడు. ఆఖ‌రి బంతికి పోర్ కొట్టి కివీస్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో వోక్స్‌, లివింగ్‌స్టోన్‌ రెండేసి వికెట్లు తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. మోయిన్ అలీ(51నాటౌట్; 37 బంతుల్లో 3పోర్లు, 2 సిక్స‌ర్లు), మలన్‌(41; 30 బంతుల్లో 4 పోర్లు, 1సిక్స్‌) రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో సౌథీ, మిల్నె, సోధీ, నీషమ్‌ ఒక్కో వికెట్ ను పడగొట్టారు. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి కివీస్‌కు విజ‌యాన్ని అందించిన ఓపెన‌ర్ మిచెల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Next Story