టాస్ కు ముందు పాక్ తో సిరీస్ రద్దు చేసుకుని వెళ్ళిపోయిన కివీస్
New Zealand abandon tour of Pakistan.పాకిస్థాన్, న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ చివరి నిమిషంలో రద్దయింది.
By M.S.R Published on 17 Sep 2021 2:10 PM GMTపాకిస్థాన్, న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ చివరి నిమిషంలో రద్దయింది. రావల్పిండిలో శుక్రవారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉంది. న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ అలెర్ట్ రావడంతో సిరీస్‌ను రద్దు చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూజిలాండ్ ప్రభుత్వ సెక్యూరిటీ అలెర్ట్ తర్వాత బ్లాక్‌క్యాప్స్ తమ పాకిస్థాన్ టూర్‌ను రద్దు చేసుకుంటోంది. రావల్పిండిలో శుక్రవారం తొలి వన్డే ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లాహోర్ వెళ్లాల్సి ఉన్నా.. టూర్ రద్దు చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ ఆ ప్రకటనలో తెలిపింది.
న్యూజిలాండ్ ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా మొదటి వన్డే జరగాల్సింది. అయితే భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టాస్కు కొన్ని నిమిషాల ముందు మొత్తం పర్యటననే నిలిపివేశారు. దీనిపై కివీస్ బోర్డు ఓ ప్రకటనలో "న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు పర్యటన రద్దు చేసుకుంటున్నాం. ఈ సిరీస్ రద్దవ్వడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై పెద్ద ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని న్యూజిలాండ్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ ఆ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి కూడా కివీస్ ఆటగాళ్లు హోటల్ రూమ్స్ నుండి బయటకు రాలేదు.. దీంతో కరోనా కారణంగా మ్యాచ్ వాయిదా అని అందరూ భావించారు. కానీ సెక్యూరిటీ భయాల కారణంగా మొత్తం సిరీస్ ను రద్దు చేసుకున్నారు.