టీమిండియాతో ఒక్క సిరీస్ పెట్టండి అంటూ బీసీసీఐకి నేపాల్ విజ్ఞప్తి
నేపాల్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తోంది. తమ దేశంలో ఒక్క సిరీస్ ఆడించాలంటూ కోరుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 2:27 AM GMTటీమిండియాతో ఒక్క సిరీస్ పెట్టండి అంటూ బీసీసీఐకి నేపాల్ విజ్ఞప్తి
ఆర్థికంగా పటిష్టంగా ఉన్న క్రికెట్ బోర్డుతో మ్యాచ్‌లు ఆడేందకు ఏ టీమ్ అయినా ఉత్సాహం చూపిస్తుంది. ఎందుకంటే అలాంటి బోర్డుతో ఆడితే తమకూ గుర్తింపు వస్తుంది. డబ్బులు కూడా వస్తాయి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ ఒకటి. ఈ బోర్డుతో సత్సంబంధాలు కొనసాగించాలని చాలా జట్లు ప్రయత్నిస్తాయి. తమ దేశంలో ఈ టీమ్ ఒక్కసారి పర్యటించినా.. ఒక్క సిరీస్ ఆడినా ఊహించనంత డబ్బు వస్తుందని ఆ టీమ్‌లకూ తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేపాల్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తోంది. తమ దేశంలో ఒక్క సిరీస్ ఆడించాలంటూ కోరుతోంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని సైతం ప్రభావితం చేయగల ఆర్థిక వనరులు బీసీసీఐకి ఉన్నాయి. అందుకే టీమ్ ఇండియాతో ఒక సిరీస్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నేపాల్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు చతుర్ బహదూర్ చంద్ తెలిపాడు. విశ్వవ్యాప్తంగా విపరీతమైన అభిమానగణం ఉన్న భారత జట్టు, నేపాల్‌తో ఒక సిరీస్ ఆడితే.. తమ దేశంలో క్రికెట్‌కు క్రేజ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నాడు. తద్వారా ఆర్థిక వనరులు సమకూరుతాయని ఆయన చెప్పాడు. ఆవిధంగా తమ దేశంలో క్రికెట్ వైపు యువత అడుగులు వేస్తారని.. వారికి భరోసా ఇచ్చినట్లు అవుతుందని కూడా పేర్కొన్నాడు బహదూర్ చంద్.
ఈ క్రమంలో నేపాల్‌లో క్రికెట్ అభ్యున్నతికి సహకారం అందించాలని బహదూర్ చంద్ బీసీసీకి విజ్ఞప్తి చేశాడు. పసికూనగా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నేపాల్ టీమ్.. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అమెరికాపై విజయం సాధించింది. అంతేకాదు.. తొలసిరాగా ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. నేపాల్ 1996 నుంచి ఐసీసీ అసోసియేట్ దేశంగా కొనుగుతూ వస్తోంది. 2014లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ హోదా దక్కించుకుంది. ఆ తర్వాత 2018లో అంతర్జాతీయ వన్డే హోదా కూడా దక్కించుకుంది. ఇలాంటి సమయంలో టీమిండియాతో సిరీస్ ఆడితే.. తమ దేశంలో క్రికెట్ మరింత ఆదరణ లభిస్తుందని నేపాల్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. మరి నేపాల్ విజ్ఞప్తిపై టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.