చరిత్ర సృష్టించిన నేపాల్.. ఒకే మ్యాచ్‌లో మూడు ప్రపంచ రికార్డ్‌లు
హాంగ్‌జౌ ఆసియా క్రీడలు 2023 పురుషుల క్రికెట్ తొలి మ్యాచ్‌లో నేపాల్ క్రికెట్ జట్టు మంగోలియాతో తలపడింది.
By Medi Samrat Published on 27 Sept 2023 2:33 PM ISTహాంగ్‌జౌ ఆసియా క్రీడలు 2023 పురుషుల క్రికెట్ తొలి మ్యాచ్‌లో నేపాల్ క్రికెట్ జట్టు మంగోలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మంగోలియా టాస్ గెలిచి ముందుగా నేపాల్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు రికార్డులు బద్ధలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ టీమ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యధిక స్కోరు నమోదు చేసింది. నేపాల్ జట్టులో ఒక బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయగా, ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు.
నేపాల్ 3 వికెట్లు కోల్పోయి మంగోలియాకు 314 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో టీ20 క్రికెట్‌లో 300 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా నేపాల్ నిలిచింది. ఇంతకు ముందు టీ20ల్లో అఫ్గానిస్థాన్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో అఫ్గానిస్థాన్ అత్యధికంగా 278 పరుగులు చేసింది.
ఇది కాకుండా టి20 క్రికెట్‌లో నేపాల్ బ్యాట్స్‌మెన్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సృష్టించాడు. కుశాల్ మల్లా 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మల రికార్డ్ బ్రేక్ అయ్యింది.
దీంతోపాటు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు కూడా బద్దలైంది. దీపేంద్ర సింగ్ ఎయిరి 9 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నేపాల్ క్రికెట్ జట్టు T20 క్రికెట్‌లోని మూడు పెద్ద రికార్డులను తన పేరిట నమోదు చేయడంతో వరల్డ్ క్రికెట్‌లో పేరు మార్మోగుతుంది.