ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌2022.. రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా

Neeraj Chopra wins silver in 2022 World Athletics Championships.అమెరికాలోని యూజీన్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ అథ్లెటిక్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2022 9:17 AM IST
ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌2022.. రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా

అమెరికాలోని యూజీన్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌2022లో ఒలింపిక్ స్వ‌ర్ణ ప‌త‌క విజేత‌, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ర‌జతం కైవ‌సం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రో తో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా సిల్వర్‌ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అండ‌ర్స‌న్ పీట‌ర్స్‌(గ్రెనెడా) 90.54 మీట‌ర్ల దూరం విసిరి స్వ‌ర్ణం సాధించాడు.

తన తొలి ప్రయత్నాన్ని నీర‌జ్ చోప్రా ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. అయితే రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మూడో ప్రయత్నంలో 86.37 మీట‌ర్లు, నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. అయితే.. ఐదోదైన ఆఖ‌రి ప్ర‌య‌త్నంలో మ‌రోసారి నీర‌జ్ ఫౌల్ చేశాడు. దీంతో నాలుగో ప్ర‌య‌త్నంలో విసిరిన దూరాన్ని అత్య‌ధికంగా లెక్కించారు. మ‌రో భార‌త జావెలిన్ త్రోయ‌ర్ రోహిత్ యాద‌వ్ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. మూడు రౌండ్ల త‌రువాత ప‌దో స్థానంలో నిలిచి వైదొలిగాడు.

ఇక ర‌జ‌తం గెలిచిన‌ నీరజ్‌ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్‌ జంపర్‌ అంజూ బాబి జార్జ్‌ కాంస్య పతకాన్నిసొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story