స్టార్ పేసర్ బుమ్రాకు సలహా ఇచ్చిన నీరజ్ చోప్రా
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ తర్వాత మరింత అదరగొడుతున్నాడు.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 1:04 PM ISTస్టార్ పేసర్ బుమ్రాకు సలహా ఇచ్చిన నీరజ్ చోప్రా
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ తర్వాత మరింత అదరగొడుతున్నాడు. గాయం కారణంగా బుమ్రా 11 నెలల పాటు టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ ఇలా అన్నింటిల్లో చెలరేగి వికెట్లు తీశాడు. సొంత గడ్డపై టీమిండియా ఆడిన వరల్డ్ కప్‌లో అయితే.. బుమ్రా ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలో తక్కువ ఎకానమీతో కీలక వికెట్లను తీశాడు. మంచి పేస్‌తో పాటు.. యార్కర్స్ వేస్తూ 140 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా ఉంటుంది బుమ్రా బౌలింగ్. వరల్డ్‌లోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రాకు పేరుందనే చెప్పాలి. అయితే.. ఇండియాన్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా కూడా బుమ్రాకు పెద్ద ఫ్యాన్. ఈ క్రమంలోనే బుమ్రా తన బౌలింగ్ స్పీడ్‌ను మరింత పెంచుకోవడానికి నీరజ్ చోప్రా సలహా ఇచ్చాడు.
ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా గురించి మాట్లాడుతూ.. అతడికి ఒక సలహా కూడా ఇచ్చాడు. బుమ్రా అంటే తనకు ఎంతో ఇష్టమని నీరజ్ చోప్రా చెప్పాడు. అతని బౌలింగ్ యాక్షణ్ ప్రత్యేకమైనది అంటూ ప్రశంసించాడు. అయితే.. బుమ్రా తన బౌలింగ్ వేగాన్ని మరింత పెంచుకునేందుకు రన్ అప్‌ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు నీరజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ రన్ అప్‌ను వెనుక నుంచి ప్రారంభిస్తే వారి వేగాన్ని పెంచుకోవచ్చని అన్నాడు. జావెలిన్ త్రోయర్‌గా తానూ తరచుగా ఇదే చర్చిస్తుంటానని నీరజ్ వెల్లడించాడు.
ఇదే విషయాన్ని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌తో పాటు పలువురు మాజీలు చెప్పారు. బుమ్రా తన రన్ అప్‌ను కాస్త వెనుక నుంచి తీసుకోవడం ద్వారా వేగం పెరగుతుందని వెల్లడించారు. అయితే.. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇండియా తలపడ్డాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను నీరజ్ చోప్రా స్వయంగా వెల్లి వీక్షించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై కూడా చోప్రా స్పందించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇండియాపై మానసికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు పైచేయి సాధించారని అన్నాడు. దాంతో..బౌలింగ్‌లో ఆసీస్ ప్లేయర్లు దృఢంగా కనిపించారని చెప్పాడు. పూర్తి నమ్మకంతో ఆడి చివరకు కప్ గెలుచుకున్నారని నీరజ్ చోప్రా చెప్పాడు. కాగా.. డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ జట్టులోకి తిరిగి బుమ్రా రానున్నాడు. వరల్డ్ కప్ తర్వాత బుమ్రా రెస్ట్ తీసుకుంటోన్న విషయం తెలిసిందే.