నాలుగు రోజుల గ్యాప్‌లోనే మ‌రో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా

మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకున్నాడు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 8:39 AM IST

నాలుగు రోజుల గ్యాప్‌లోనే మ‌రో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా

మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకున్నాడు. పోటీలో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లలో నీరజ్ అత్యధికంగా 85.29 మీటర్ల త్రో విసిరాడు. పారిస్ డైమండ్ లీగ్‌లో గెలిచిన నాలుగు రోజుల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నీరజ్‌కి ఇది రెండో విజయం.

మీట్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 84.12 మీటర్లతో రెండో స్థానంలో, గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. మీట్ రెండో రౌండ్ ముగిసే సమయానికి చోప్రా మూడో స్థానంలో ఉన్నాడు. అయితే మూడో రౌండ్‌లో 85.29 మీటర్లు విసిరి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను తన తర్వాతి రెండు ప్రయత్నాలలో 82.17 మీ, 81.01 మీటర్ల త్రోలు విసిరాడు. చివరి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు.

రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జర్మనీకి చెందిన థామస్ రోహ్లే ఇక్కడ 79.18 మీటర్ల పేలవమైన త్రోతో ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో చోప్రా గ‌ట్టి పోటీనిచ్చే ప్రత్యర్థి, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ లేకపోవడంతో.. ఈ ఈవెంట్ కొంచెం నిస్తేజంగా కనిపించింది.

ఫిట్‌నెస్ కారణాల వల్ల గోల్డెన్ స్పైక్ మీట్ చివరి రెండు సీజన్‌లలో చోప్రా ఆడలేకపోయాడు. చోప్రా కోచ్ జాన్ జెలెంజీ తొమ్మిది సార్లు ఇక్కడ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో చోప్రా తన కోచ్ ఫేవరెట్ టైటిల్ విజేతల జాబితాలో చేరిపోయాడు. ఈవెంట్‌కు ముందు.. చోప్రా ఇక్కడ టైటిల్ గెలవలేద‌నే నిరాశలో క‌నిపించాడు. 27 ఏళ్ల చోప్రా ఈ సీజన్‌లో మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో 90 మీటర్లకు పైగా త్రో చేశాడు.

Next Story