శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయనకు ఇటీవల ఒక బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు చెన్నైలో ఆదివారం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వైద్యులు అతనికి ఒక స్టెంట్‌ను అమర్చారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చెన్నైలో ఉన్న మురళీధరన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక అపోలో ఆసుపత్రిలో చేరాడు. శనివారమే 49 ఏళ్లు పూర్తి చేసుకున్న మురళీధరన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మళ్లీ సన్‌రైజర్స్ జట్టుతో చేరతాడు. మురళీధరన్ కు యాంజియోప్లాస్టీ సక్సెస్ ఫుల్ గా జరగడంతో సన్ రైజర్స్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
మార్చి నెలలో మురళీధరన్ కు బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయనకు వైద్యులు సక్సెస్ ఫుల్ గా యాంజియోప్లాస్టీని నిర్వహించారు. ప్రస్తుతం మురళీధరన్ ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 2015 నుండి మురళీధరన్ సన్ రైజర్స్ తో కలిసి పని చేస్తూ ఉన్నాడు. సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం బలంగా ఉన్నా.. మిడిలార్డర్ సరిగా లేకపోవడంతో ఓటములను చవిచూస్తూ ఉంది. ఈ ఏడాది ఆడిన మూడు మ్యాచ్ లలోనూ సన్ రైజర్స్ ఓటమిని చవిచూసింది.