ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్ మొత్తం ముంబై జట్టు ఎంతో దూకుడుగా ఆడుతూ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో కూడా భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. పృథ్వీ షా నాయకత్వంలోని ముంబై జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పృథ్వీ షా(73: 39 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆదిత్య తారే(118 నాటౌట్: 107 బంతుల్లో 18ఫోర్లు) శతకంతో రాణించడంతో 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
శివమ్ దూబే(42), శామ్స్ ములానీ(36) ఆకట్టుకున్నారు. ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. మాదవ్ కౌశిక్(158 నాటౌట్: 156 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించాడు. సమర్థ్ సింగ్(55), అక్షదీప్ నాథ్(55) అర్ధసెంచరీలతో రాణించారు. ఈ సీజన్ లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ లతో చెలరేగాడు.
ఒక డబుల్ సెంచరీ కూడా బాదాడు పృథ్వీ షా..! ఫైనల్ మ్యాచ్‌లో సైతం అద్భుతంగా ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 800కుపైగా పరుగులు (827 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడడంతో ముంబై జట్టు విజయాన్ని అందుకోవడం చాలా తేలికైంది.