ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఔట్
Mumbai knock Chennai out of playoffs race.బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత సరిగ్గా
By తోట వంశీ కుమార్ Published on 13 May 2022 8:44 AM ISTబండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత సరిగ్గా చెన్నైసూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు సరిపోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక సార్లు విజేతలుగా నిలిచిన ఈ జట్లు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా విఫలం అయ్యాయి. అన్ని జట్ల కన్నా ముందే ముంబై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాగా.. తాజాగా చెన్నై అవకాశాలకు కూడా గండి పడింది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ముంబై లేదా చెన్నై జట్లు ప్లే ఆఫ్స్ బరిలో లేకపోవడం ఇదే తొలిసారి. బంతితో చెన్నైని వణికించిన ముంబై.. 5 వికెట్ల తేడాతో టోర్నీలో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ కాన్వే(0) తో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. అలీ(0), ఊతప్ప(1), రుతురాజ్(7), రాయుడు(10), దూబె(10) పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది చెన్నై. ఓ వైపు కెప్టెన్ ధోనీ(36 నాటౌట్) నిలబడగా.. మరో వైపు అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్లు కరువయ్యారు. బ్రావో(12), సిమర్ జీత్(2), తీక్షణ(0), ముకేశ్ చౌదరి(4) వెంట వెంటనే ఔట్ కావడంతో.. అవతలి ఎండ్ లో ఉన్న ధోనీ చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. దీంతో చెన్నై 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓవరాల్‌గా లీగ్‌లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. సామ్స్(3/16), మెరెడిత్(2/27), కార్తికేయ(2/22), బుమ్రా(1/12) లు చెన్నై పతనాన్ని శాసించారు.
అనంతరం స్వల్ప లక్ష్యన్ని చేదించడానికి బరిలోకి దిగిన ముంబైకి కష్టాలు తప్పలేదు. ముకేశ్ చౌదరి(3/23) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది. ఇషాన్ కిషన్(6), రోహిత్ శర్మ(18) పేలవ ఫామ్‌ను కొనసాగించారు. సామ్స్(1), స్టబ్స్(0) కూడా వెంట వెంటనే పెవిలియన్‌కు చేరడంతో ముంబై 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ముంబైకి మరో ఓటమి తప్పదేమోనని అనిపించింది. ఈ సీజన్‌లో ముంబై తరుపున అత్యంత నిలకడగా ఆడుతున్న హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ (34 నాటౌట్ ;32 బంతుల్లో 4 పోర్లు), హృతిక్ షోకీన్(18)తో కలిసి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. ఎలాంటి తడబాటు లేకుండా సాధికారంగా బ్యాటింగ్ చేసిన ఈ జంట అయితో వికెట్‌కు 48 పరుగులు జోడించి ముంబైని విజయం వైపు నడిపించారు. జట్టు స్కోర్ 81 పరుగుల వద్ద షోకీన్ ఔటైనా.. టిమ్ డేవిడ్(16 నాటౌట్) తో కలిసి తిలక్ జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై 14.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. మూడు కీలక వికెట్లతో చెన్నైని కుప్పకూల్చిన సామ్స్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.