గుజరాత్‌కు తొలి ఓటమి.. ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం..!
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత అర్ధ సెంచరీ ఆధారంగా, ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హ్యాట్రిక్ విజయాలు సాధించకుండా గుజరాత్ జెయింట్స్‌ను అడ్డుకుంది.
By - Medi Samrat |
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత అర్ధ సెంచరీ ఆధారంగా, ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హ్యాట్రిక్ విజయాలు సాధించకుండా గుజరాత్ జెయింట్స్‌ను అడ్డుకుంది. ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
గుజరాత్ చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు జోడించి బలమైన స్కోరు చేసినప్పటికీ ముంబై ముందు అది తక్కువే అనేలా ఆడారు. గుజరాత్ 19వ ఓవర్‌లో 16 పరుగులు, చివరి ఓవర్‌లో 23 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారతీ ఫూల్మాలి 15 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 36 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడింది. జార్జియా వేర్‌హామ్ 33 బంతుల్లో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆ తర్వాత ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 43 బంతులలో 71 పరుగులతో అజేయంగా నిలవడంతో వీరిద్దరి శ్రమ ఆవిరైంది. కౌర్ ఇన్నింగ్సులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ముంబై జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, క్యారీ మైదానంలో ఉన్నారు. జట్టు విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక్కడి నుంచి హర్మన్‌ప్రీత్ యాక్సిలరేటర్‌పై అడుగుపెట్టి వేగంగా పరుగులు చేసింది. తద్వారా ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ కెరియర్‌లో 10వ అర్ధ సెంచరీని పూర్తి చేసింది. ఈ క్రమంలోనే లీగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. నికోల్ కారీ కెప్టెన్‌కు మద్దతుగా నిలిచింది. ఆమె 23 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
గుజరాత్ తరఫున బెత్ మూనీ, కనికా అహుజా తుఫాను బ్యాటింగ్ చేశారు. పవర్‌ప్లేలో జట్టు ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేయగలిగింది. జట్టు స్కోరు 22 వద్ద మూడో ఓవర్ నాలుగో బంతికి సోఫీ డివైన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత కనిక, మూనీలు వేగంగా పరుగులు చేశారు. ఏడో ఓవర్ మూడో బంతికి అమేలియా కర్ మూనీని ఔట్ చేసింది. మూనీ 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 33 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత వచ్చినకెప్టెన్ యాష్లే గార్డనర్‌ను కారీ ఔట్ చేసింది. ఆమె 11 బంతుల్లో 22 పరుగులు చేసింది.
రెండు పరుగుల తర్వాత కనికా కూడా ఔటైంది. కనికా 18 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసింది. ఆపై చివర్లో భారతి, జార్జియా వేగంగా ఆడి భారీ స్కోరుకు తీసుకెళ్లారు.