ముంబై ఇండియన్స్ సంచలనం.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా
Mumbai Indians wins against KKR by 10 runs.ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. ఓటమి తప్పదు అనుకున్న మ్యాచులో సంచలన విజయం నమోదు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2021 7:35 AM ISTముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. ఓటమి తప్పదు అనుకున్న మ్యాచులో ఆ జట్టు సంచలన ప్రదర్శన చేయడంతో లోస్కోరింగ్ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. 153 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా జట్టు నితీష్ రాణా(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శుభ్‌మన్ గిల్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33) రాణించినా.. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 10 పరుగుల తేడాతో ఆ జట్టు ఓటమి పాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే షాక్‌తగిలింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(2) ఔటైయ్యాడు. దీంతో 10 పరుగులకే ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో ముంబైని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. వీరిద్దరు కోల్‌కత్తా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ముంబై కోలుకుంది. 10 ఓవర్లకు ముంబై 86 పరుగులు చేసింది. 11 ఓవర్లలో సూర్య ఔటైన తరువాత వికెట్ల పతనం కొనసాగింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రాణించకపోవడంతో ముంబై చివరకు 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ సాపీగా ఆరంభమైంది. ఓపెనర్లు, నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్ రాణించడంతో 8.4 ఓవర్లలో 72 /0తో నిలిచింది. దీంతో ఆ జట్టు ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే.. స్పిన్నర్ రాహుల్ చహర్(4/27) తన మాయాజాలంతో ముంబైని మ్యాచ్‌లోకి తెచ్చాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేయలేక గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 18వ ఓవర్‌లో కృనాల్ 3 రన్స్ ఇవ్వగా.. 19 ఓవర్ జస్‌ప్రీత్ బుమ్రా 4 పరగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ అవకాశాలను దెబ్బతీశారు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ట్రెంట్ బౌల్ట్ కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దాంతో ముంబై విజయం సంచలన విజయం సాధించింది.