చెలరేగిన డికాక్.. రోహిత్ సేన ఘన విజయం
Mumbai indians win by 7 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 29 April 2021 1:43 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ (70; 50 బంతుల్లో 6 పోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో రాణించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేదించింది.
ముంబై బ్యాటింగ్‌లో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆటే హైలెట్ అని చెప్పవచ్చు. ఓ వైపు రోహిత్ శర్మ (14; 17 బంతుల్లో 1 సిక్స్) తడబడినప్పటికి.. రాజస్థాన్ బౌలర్లపై డికాక్ ఎదరుదాడికి దిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రోహిత్ వికెట్ ను కోల్పోయిన ముంబై 49/1 తో నిలిచింది. వన్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (16; 10 బంతుల్లో 3 పోర్లు) ధాటిగా ఆడే క్రమంలో క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో బట్లర్ చేతికి చిక్కాడు. అయినప్పటికి ముంబైకి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. డికాక్ కు కృనాల్ పాండ్య (39; 26 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సర్లు) జత కలిసాడు. వీరిద్దరు రాజస్థాన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బంతిని బౌండరీ దాటించారు. విజయానికి కొద్ది పరుగుల దూరంలో కృనాల్ ఔటైనా.. పొలార్డ్ (16; 8 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్) తో కలిసి డికాక్ ముంబైకి విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్ రెండు వికెట్లు పడగొట్టగా రెహ్మాన్ ఒక వికెట్ తీశాడు.
అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. జోస్ బట్లర్(41; 32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), యశస్వి జైశ్వాల్(32; 20 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రాహుల్ చహర్ విడగొట్టాడు. అర్థశతకాల దిశగా సాగుతున్న వీరిద్దరినీ రాహుల్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. ఇక 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 91/2తో నిలిచింది. సంజూ శాంసన్(42; 27 బంతుల్లో 5ఫోర్లు), శివమ్ దూబే(35; 31 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) లు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. సంజు శాంసన్ ధాటిగా ఆడగా.. దూబే నిదానంగా ఆడాడు. ముంబై కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లు పరుగులు తీసేందుకు బాగా కష్టపడ్డారు. ధాటిగా ఆడే క్రమంలో సంజు ఔట్ కావడం.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు వేగంగా పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.